పురుడులో బిడ్డతో సహా కన్నుమూసిన స్టార్ హీరోయిన్

ఆడవారికి పురిటి నొప్పులు తట్టుకుని పండంటి బిడ్డకు జన్మనివ్వడం అనేది వారికి మరో జన్మ ఎత్తినంత పని అంటారు పెద్దలు. ఈ నానుడి ప్రతి మాతృమూర్తికి వర్తిస్తుందని నమ్ముతారు మన భారతీయులు. అయితే కొందరికి మాత్రం కాలం చిన్నచూపు చూడటంతో పురిటి నొప్పులతో తల్లి లేదా పుట్టుకులో బిడ్డ చనిపోవడం చూస్తుంటాం. కానీ తాజాగా జరిగిన ఓ సంఘటన అందరి మనసులను కలిచివేసింది. ముఖ్యంగా సినిమా ప్రేమికుల మనసులను ముక్కలు చేసేసింది. ఎందుకంటే పురటిలోనే బిడ్డతో సహా చనిపోయింది ఓ హీరోయిన్. దీంతో కేవలం ఆమె అభిమానులే కాకుండా యావత్ సినీ ఇండస్ట్రీ విషాదంలోకి వెళ్లిపోయింది.

ఇక ఈ ఘటన జరిగిన విషయంలోకి వెళితే.. మహారాష్ట్రలో ప్రముఖ మరాఠి నటి పూజా జంజర్(25) పురిటి నొప్పులతో కొట్టుమిట్టాడుతుండగా.. ఆమె బంధువులు ఆమెను స్థానిక గోరేగావ్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఓ బిడ్డకు జన్మనిచ్చిన పూజకు తీవ్ర రక్తస్రావం జరిగింది. ఇది చాలదన్నట్లు అప్పుడే పుట్టిన బిడ్డ కూడా మృత్యువాత పడ్డాడు. దీంతో ఆమెను వెంటనే హింగోలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే అర్ధరాత్రి కావడంతో అంబులెన్సులు అందుబాటులో లేకపోవడంతో ఆమె కూడా మృతి చెందింది.

దీంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయారు. ఈ విషయం తెలుసుకున్న మరాఠి సినీ జనాలు పూజాకు అశ్రునివాళులు అర్పిస్తున్నారు. ఏదేమైనా దేవుడి సృష్టిలో అందరూ సమానమే.. అది జననమైనా.. మరణమైనా అంటూ కొందరు వేదాంతం వల్లిస్తున్నారు.

Leave a comment