సాహోపై చీటింగ్ కేసు నమోదు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో ఒక్కసారిగా ఇంటర్నేషనల్ హీరోగా మారాడు. కాగా ఆ సినిమా తరువాత ప్రభాస్ లెవెల్ అమాంతం పెరిగిపోవడంతో సాహో చిత్రంపై కూడా అత్యంత భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంతే భారీ అంచనాల నడుమ ఈ సినిమా రిలీజ్ అయ్యి అది కాస్త బాక్సాఫీస్ వద్ద మిక్సిడ్ టాక్‌ను సొంతం చేసుకుని డిజాస్టర్‌వైపు దూసుకెళ్లింది.

అయితే ఈ సినిమాపై ఇప్పుడు ఓ చీటింగ్ కేసు నమోదు అయ్యింది. ఈ సినిమాలో ఆర్కటిక్ ఫాక్స్ అనే బ్యాగ్ బ్రాండ్‌ను చూపిస్తామని సాహో చిత్ర యూనిట్ ఈ మేరకు ఆ కంపెనీ యాజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ ఆ కంపెనీకి ఇచ్చే మొత్తాన్ని సాహో చిత్రం ముట్టచెప్పలేదంటూ సదరు కంపెనీ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతకీ సాహో చిత్ర యూనిట్ రెస్పాండ్ కాకపోవడంతో వారిపై చట్టపరంగా కేసు నమోదు చేసారు.

మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో అక్టోబర్ 17న కేసు నమోదైనట్లు తెలుస్తోంది. మరి ఈ వివాదంపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఏదేమైనా నష్టాలను మిగిల్చిన సాహోకు ఇదో కొత్త తలనొప్పి వచ్చి పడిందని చిత్ర యూనిట్ నెత్తిపట్టుకున్నారు.

Leave a comment