జియో.. ఈ మాట వింటే చాలు ఫోన్ కంటే ఫ్రీ ఆఫర్ గుర్తుకొస్తుంది. ఫ్రీ డేటా, కాల్స్ తో దేశంలో టెలికాం రంగాన్ని మార్చేసింది రిలయన్స్. రాబోయే జియో ఫోన్ కూడా ఫ్రీ కావటంతో మొబైల్ కంపెనీలతోపాటు.. సర్వీస్ అందించే టెలికాంలు నష్టాల్లో పడ్డాయి. జియోకు పోటీగా ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్ కూడా మొబైల్ కంపెనీలతో టై అప్ అయ్యి.. జియోపైనే యుద్ధం ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే జియో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఫ్రీ ఆఫర్స్ ఇచ్చేది లేదని..
ఇప్పటి వరకు ప్రకటించినవి కొనసాగుతాయని.. భవిష్యత్ లో ఉచితంగా ఇచ్చే అవకాశాలు లేవని కంపెనీలు వర్గాలు చెబుతున్నట్లు ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ సంస్థ ప్రకటించింది. ఇక నుంచి జియో వ్యాపారాత్మక వైఖరి అవలంభించబోతుందని విశ్లేషకులు చెబుతున్నారు. పెట్టుబడి, ఆదాయం, లాభాలపై జియో ఫోకస్ చేస్తుందని కూడా స్పష్టం చేసింది ఆ సంస్థ. ఫ్రీ, డిస్కౌంట్ ఆఫర్లతో ఏడాది కంటే తక్కువ సమయంలోనే దేశంలో 10శాతం టెలికాం వినియోగదారులను సొంతం చేసుకుంది జియో. ఇదే విధమైన ఫ్రీ, డిస్కౌంట్లను మరిన్ని రోజులు కొనసాగించటం కంపెనీకి భారంగా చెప్పుకొచ్చారు ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ క్రెడిట్ అనాలిస్ట్ అశుతోష్ శర్మ.