సినిమా: టక్కర్
నటీనటులు: సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్, అభిమన్యు సింగ్, యోగి బాబు తదితరులు
దర్శకత్వం: కార్తిక్ జి క్రిష్
మ్యూజిక్: నివాస్ కె ప్రసన్న
రిలీజ్ డేట్: 09-06-2023
టాలీవుడ్‌లో ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ వంటి క్లాసిక్ చిత్రాలతో తనకంటూ లవర్ బాయ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరో సిద్ధా్ర్థ్. తన సినిమా ఎంపికలో తప్పటడుగులు వేసిన ఈ హీరో, ఆ తరువాత స్టార్‌డమ్ కోల్పోవడమే కాకుండా.. హీరోగా కూడా మరుగున పడిపోయాడు. అయితే, గృహం సినిమాతో మళ్లీ ఫాంలోకి వచ్చిన సిద్ధార్థ్, అడపాదడపా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. తాజాగా ‘టక్కర్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో, వారిని ఎంతమేర ఆకట్టుకున్నాడో ఈ రివ్యూలో చూద్దాం.
కథ:
గుణశేఖర్(సిద్ధార్థ్) అనే కుర్రాడు ఎలాగైనా ధనవంతుడిని కావాలనే కలలు కంటూ బతుకుతుంటాడు. దాని కోసం పలు ప్రయత్నాలు కూడా చేస్తుంటాడు. అయితే ఈ క్రమంలోనే అతడు లక్కీ(దివ్యాంశ) అనే గొప్పింటి అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆ తరువాత అతడి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది.. అతడి ప్రేమలో పడ్డ లక్కీ ఎలాంటి కష్టాలను ఎదుర్కొంది.. గుణ అనుకున్నట్లుగా గొప్పవాడిగా మారాడా లేడా.. అనేది సినిమా కథ.
విశ్లేషణ:
హీరో సిద్ధార్థ్ సినిమాలంటే తమిళ ఆడియెన్స్‌తో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ ఏర్పడుతుంది. ఇక ఈ హీరో నటించిన టక్కర్ సినిమా ప్రమోషన్స్‌ను బాగానే చేశారు చిత్ర యూనిట్. దీంతో ఈ సినిమాపై కొన్ని వర్గాల ప్రేక్షకుల్లో క్రేజ్ క్రియేట్ అయ్యిందనేది వాస్తవం. కాగా, పలు ఇతర సినిమాలకు పోటీగా రిలీజ్ అయిన ‘టక్కర్’ సినిమా విజయాన్ని సాధించాలని సిద్ధార్థ్ ఫ్యాన్స్ కోరుతున్నారు.
ఇక ఈ సినిమా ఫస్టాఫ్ విషయానికి వస్తే.. ఎలాగైనా ధనవంతుడిని కావాలని ఆశించే కుర్రాడి పాత్రలో సిద్ధార్థ్ అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ పాత్ర చాలా మంది యూత్‌కి కనెక్ట్ అవుతుంది. అయితే ఈ క్రమంలో అతడు చేసే పనులు అతడికి కష్టాలను తెచ్చిపెడతాయి. కాగా, ఓ గొప్పింటి అమ్మాయిని చూసి ఆమెతో ప్రేమలో పడతాడు మన హీరో. ఇక అటుపై ఆమెను దక్కించుకునేందుకు మనోడు పడే పాట్లు మామూలుగా ఉండవు. అయితే, ఓ సాలిడ్ ట్విస్ట్‌తో వచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్ హీరో నెక్ట్స్ ఏం చేస్తాడా అనే ఆసక్తిని అయితే ప్రేక్షకుల్లో క్రియేట్ చేస్తుంది.
అటు సెకండాఫ్‌లో తనకు ఎదురైన సమస్యలను హీరో ఎలా పరిష్కరిస్తాడా అని ఆడియెన్స్ ఆసక్తిగా చూస్తారు. కానీ, వారి ఎదురుచూపులకు ఏమాత్రం న్యాయం చేసే విధంగా సెకండాఫ్ లేకపోవడం తీవ్ర నిరాశకు గురిచేస్తుంది. ఓ సాధారణ ప్రీ-క్లైమాక్స్, చప్పగా ఉండే క్లైమాక్స్‌తో తూతూ మంత్రంగా చిత్ర యూనిట్, ఈ సినిమాకు ‘ది ఎండ్’ కార్డ్‌ను వేస్తుంది. దీంతో ప్రేక్షకులు అసహనంతో సినిమా థియేటర్ల నుండి బయటకు వస్తారు.
ఓవరాల్‌గా మంచి కాన్సెప్ట్ అయినా కూడా దాన్ని నడిపించే విధానంలో చిత్ర యూనిట్ ఘోరంగా ఫెయిల్ అయ్యింది. సినిమాలో కమర్షియల్ అంశాలకు బోలెడంత స్కోప్ ఉన్నా, చిత్ర యూనిట్ ఏమాత్రం వాటిపై ధ్యాస పెట్టకపోవడంతో ఈ సినిమా ఓ డిజాస్టర్‌గా సిద్ధార్థ్ కెరీర్‌లో నిలుస్తుందని చెప్పాలి.
నటీనటుల పర్ఫార్మెన్స్:
చాలా రోజుల తరువాత సిద్ధార్థ్ నుండి ఓ సినిమా రావడంతో ఆయన పర్ఫార్మెన్స్ చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. వారిని ఏమాత్రం నిరాశపర్చకుండా సినిమాలో సిద్ధార్థ్ పర్ఫార్మెన్స్ ఉండటమే ఈ సినిమాకు మేజర్ హైలైట్ అని చెప్పాలి. ఇక హీరోయిన్‌గా దివ్యాంశ కౌశిక్ తనకు వచ్చిన పాత్రను బాగానే చేసింది. మిగతా నటీనటులు పెద్దగా గుర్తింపు ఉన్న పాత్రలు కాకపోవడంతో వారిని ప్రేక్షకులు ఎక్కువగా గుర్తించుకోరు.
టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
దర్శకుడు కార్తిక్ జి క్రిష్ రాసుకున్న కథ బాగున్నా, దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం ట్రాక్ తప్పింది. ఓ చక్కటి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా నిలవాల్సిన సినిమాను బిలో యావరేజ్ మూవీగా మలిచి ఈ దర్శకుడు చేతులు కాల్చుకున్నాడని చెప్పాలి. సినిమాటోగ్రఫీ బాగుంది. మ్యూజిక్ ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు. ఎడిటింగ్ వర్క్స్ ఇంకా చేయాల్సి ఉండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
చివరగా:
టక్కరి – సిద్ధార్థ్ కోసం ఒక్కసారి.. మిస్ అయితే మరీ మంచిది!
రేటింగ్:
1.75/5.0