Moviesఆక్సిజన్ మూవీ రివ్యూ

ఆక్సిజన్ మూవీ రివ్యూ

గోపీచంద్‌ అంటే మనకు టక్కున గుర్తొచ్చేది ఆయన చేసిన మాస్‌, యాక్షన్‌ చిత్రాలే. తాను చేసే ప్రతీ సినిమా అందుకు తగ్గట్టుగానే ఉండేలా చూసుకుంటారాయన. 2014లో విడుద‌లైన లౌక్యం త‌ర్వాత మూడేళ్లుగా స‌రైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు హీరో గోపీచంద్‌. ఎలాగైనా స‌క్సెస్ కొట్టాల‌నే తాప‌త్ర‌యం గోపీచంద్‌లో క‌న‌ప‌డుతుంది. వ‌రుస సినిమాలు చేస్తూ వ‌స్తున్నాడు. గోపీచంద్ త‌న‌కున్న యాక్ష‌న్ ఇమేజ్ బేస్ చేసుకుని చేసిన సినిమాయే `ఆక్సిజ‌న్‌`. టైటిల్ విభిన్నంగా ఉండ‌టంతో ప్రారంభంలో సినిమాపై ఆస‌క్తి ఏర్ప‌డింది. అలాగే ల‌క్ష్యం త‌ర్వాత జ‌గ‌ప‌తిబాబు, గోపీచంద్ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న సినిమా కూడా ఇదే. ఎప్పుడో నీ మ‌న‌సు నాకు తెలుసు అనే సినిమాను డైరెక్ట్ చేసిన ఎ.ఎం.ర‌త్నం త‌న‌యుడు ఎ.ఎం.జోతికృష్ణ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డంతో పాటు సినిమా విడుద‌ల వాయిదా ప‌డుతూ రావ‌డం సినిమాపై ఓ ర‌క‌మైన అనాస‌క్తిని క్రియేట్ చేసింది. మ‌రి ఆక్సిజ‌న్ ఎలా ఉంది? అని తెలుసుకోవాలంటే సినిమా క‌థ‌లోకి లుక్కేద్దాం.

3011reviews255b

కథేంటంటే:

కృష్ణ ప్ర‌సాద్ ( గోపీచంద్‌) పెళ్లి చూపుల కోసం అమెరికా నుంచి రాజ‌మండ్రికి వ‌స్తాడు. అక్క‌డ ఊరి పెద్ద ర‌ఘుప‌తి (జ‌గ‌ప‌తిబాబు) కుమార్తె శ్రుతి (రాశీఖ‌న్నా)ను చూసి ఇష్ట‌ప‌డి పెళ్లి చేసుకోవ‌డానికి అంగీక‌రిస్తాడు. అయితే శ్రుతికి వూరు వదిలి వెళ్లడం ఇష్టంలేదు. అందుకని కృష్ణప్రసాద్‌లో లోపాలు వెతికి సంబంధం చెడగొట్టాలని చూస్తుంది. కానీ, కృష్ణ చాలా మంచివాడు. కుటుంబానికి బాగా దగ్గరవుతాడు. దాంతో శ్రుతికి కృష్ణప్రసాద్‌కి పెళ్లి చేయాలని ఇంట్లో నిర్ణయిస్తారు. ఈలోగా శత్రువుల నుంచి కుటుంబానికి ముప్పు ఏర్పడుతుంది. ఆ ముప్పు నుంచి కృష్ణప్రసాద్‌ వారిని ఎలా రక్షించాడన్నదే ‘ఆక్సిజన్‌’ కథ.

3011reviews255c

ప్లస్ పాయింట్లు:

ఇది పూర్తి కమర్షియల్‌ సినిమా. విశ్రాంతి ముందొచ్చే ట్విస్టే కథకి ప్రధాన బలం. దాంతో రఘుపతి కుటుంబానికి అసలైన శత్రువెవరో తెలుస్తుంది. అప్పటివరకూ రొటీన్‌గా సాగుతున్న కథ.. గోపీచంద్ న‌ట‌న బావుంది. వంద‌మందిని కొట్టే స‌న్నివేశం అత‌ని హైట్‌కీ, ప‌ర్స‌నాలిటీకి త‌గ్గ‌ట్టుగా ఉంది. అటు మంచి వాడిగానూ, చివ‌రిలో విల‌న్ గెట‌ప్‌లోనూ జ‌గ‌ప‌తిబాబు మెప్పించారు. రాశీఖ‌న్నా యాజ్ యూజువ‌ల్‌గా త‌న‌కు ఇచ్చిన పాత్ర‌లో న‌టించింది. చంద్ర‌మోహ‌న్‌, సుధ జంట ఆక‌ట్టుకుంటుంది. అను ఇమ్మాన్యుయేల్ పాట‌లో గ్లామ‌ర్ డోస్ కాస్త పెంచింది. పాట‌లు విన‌డానికి బానే ఉన్నాయి. తెలుగు గురించి ప్ర‌స్తావించ‌డం బావుంది. ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌కి ముందు వ‌చ్చే ట్విస్ట్ ని ఎవ‌రూ అంత తేలిగ్గా ఊహించ‌లేరు. స‌మాజాన్ని ప‌ట్టి పీడిస్తున్న వ్య‌స‌నాన్ని గురించి ఈ సినిమాలో సూటిగా ప్ర‌స్తావించారు.

మైనస్ పాయింట్లు:

గోపీచంద్‌ రెండు విభిన్నమైన పార్శ్వాలున్న‌ పాత్రలు పోషించాడు. తొలి సగంలో బుద్ధిమంతుడిగా కనిపించిన గోపీచంద్‌.. ద్వితీయార్ధంలో తన యాక్షన్‌ ఇమేజ్‌కి తగ్గట్టు నడుచుకున్నాడు. గోపీచంద్ పంచెక‌ట్టుతో, పెళ్లి కొడుకులా ఎయిర్‌పోర్టు నుంచి వ‌చ్చే స‌న్నివేశాలు కాసింత అతిగా అనిపిస్తాయి. ట్రైన్ ఎపిసోడ్‌, అలీ కామెడీ అనుకున్నంత‌గా పండ‌లేదు. హీరోయిన్‌కీ, అలీకి మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు కూడా మెప్పించ‌వు. సాయాజీషిండే గ్యాంగ్ ఎందుకు ఉంటుందో అర్థం కాదు. విల‌న్ ముఖాల‌ను వ‌రుస‌గా జ‌గ‌ప‌తిబాబు త‌మ్ముళ్లుగా చూపించిన‌ప్పుడే అస‌లు సిస‌లైన విల‌న్లు వాళ్లేన‌ని ప్రేక్ష‌కుడు ఊహించ‌గ‌ల‌డు. ట్రైల‌ర్ క‌ట్ చేసినంత ఓపిగ్గా సినిమా ఎడిటింగ్ విష‌యం మీద దృష్టి పెట్టి ఉండాల్సింది.

స‌రిగా గ‌మ‌నించ‌గ‌లిగితే డ‌బ్బింగ్‌లోనూ కొన్ని చోట్ల లోపం క‌నిపిస్తుంది. అను ఇమ్మాన్యుయేల్ ది ఒక ర‌కంగా గెస్ట్ రోల్‌. `ఆక్సిజ‌న్‌` గురించి ఒక్క మాట‌లో చెప్పాలంటే మంచి ఆలోచ‌న‌ను మామూలు క‌మ‌ర్షియ‌ల్ ఫార్మేట్‌కి మార్చేశారు.

రేటింగ్‌: 2/5

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news