తెలుగు సినిమా ప్రేక్షకులను ఉర్రూతలూగించిన మూవీ.. పదహారేళ్ల వయసు. అనేక వైవిధ్యాలకు.. అనేక ప్రయోగాలకు ఈ సినిమా వేదిక. ఈ చిత్రంలో హీరో(చంద్రమోహన్) పాత్ర చివరి వరకు అమాయకంగా.. చింపిరి జుట్టుతో ఉంటుంది. ఇక, హీరోయిన్ పాత్రలో శ్రీదేవి నటన అద్భుతం. మరోవైపు.. విలనీగా మోహన్ బాబుకు పెద్ద బ్రేక్ ఇచ్చిన మూవీ కూడా ఇదే.
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ మూవీ.. ఆసాంతం కుటుంబ సమేతంగా ఆస్వాదించారు. అయితే.. ఈసినిమాలో ప్రధానంగా ఉన్న చర్చ ఏంటంటే.. పదహారేళ్ల వయసు నాటికి ఆ సినిమాలో హీరోయి న్‌గా నటించిన శ్రీదేవి వయసు ఎంత? అనేదే! సినిమా అంతా కూడా.. ఒక యువతి 16-17 ఏళ్ల వయసులో ఎలా వ్యవహరిస్తుంది? ఎలా ప్రేమలో పడుతుంది? ఆశలు.. ఆరాటాల చుట్టూ తిరుగుతుంది.
ఈ క్రమంలో శ్రీదేవిని కూడా.. అదే వయసులో సినిమాలో తీసుకున్నారనేది అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగేది. పదహారేళ్ల వయసు సినిమా సమయానికి శ్రీదేవి వయసు కూడా పదహారేళ్లేనని అనేవారు. చూసేం దుకు కూడా శ్రీదేవి అలానే కనిపించేది. అయితే.. సినీ ప్రస్థానంలో శ్రీదేవి.. చిన్ననాటి ఉండడంతో.. ఆయా సినిమాలు రిలీజ్ అయిన తేదీలు.. ఆమె వేసిన వేషాలు.. వంటివాటిని పరిగణనలోకి తీసుకునేవారు.
ఇలా.. లెక్కలు వేసిన కొందరు మాత్రం పదహారేళ్ల వయసు సినిమా నాటికి శ్రీదేవికి 18 ఏళ్లని చెప్పేవారు. మరికొందరు కాదు.. కాదు.. 20 అని వాదించేవారు. ఇదేవిషయాన్ని ఒకసందర్భంలో విజయవాడకు వచ్చిన శ్రీదేవిని మీడియా ప్రశ్నించింది(అప్పట్లో). దీనికి ఆమె.. “సినిమా పరంగా నా వయసు పదహారేళ్లు దట్సాల్“ అని ముక్తసరి సమాధానంతో ఈ వివాదానికి తెరదించారు. అయితే.. వివాదం మాత్రం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.
ఈ సినిమా తర్వాత చంద్రమోహన్ – శ్రీదేవి కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి. అవన్నీ హిట్ అయ్యాయి. ఆ తర్వాత ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్‌బాబు లాంటి స్టార్ హీరోలతో ఛాన్సులు రావడంతో శ్రీదేవి వెనక్కు తిరిగి చూసుకోలేదు.