ఎన్టీఆర్ వారసుడిగా నందమూరి బాలకృష్ణ అనేక సినిమాలు చేశారు.. చేస్తున్నాడు కూడా..! అయితే.. ఎన్టీ ఆర్‌లో ఉన్న అన్ని లక్షణాలు బాలయ్యకు రాకపోయినా.. కొన్ని కొన్ని విషయాలు మాత్రం అచ్చుగుద్ది నట్టు అబ్బాయని అంటారు వాటిలో ప్రధానంగా డిసిప్లిన్. రెండు నిర్మాతలకు గౌరవం ఇవ్వడం. అయితే.. ఈ రెండో విషయంలో బాలయ్య కొన్ని వివాదాల్లో ఇరుక్కున్న విషయం తెలిసిందే.
డిసిప్లెన్ విషయంలో ఆయన తన అభిమానులపై కూడా కసరుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ విషయంలో ఆయన్ను అర్థం చేసుకుంటే బాలయ్య వాళ్లకు దేవుడే. నిర్మాతల విషయాన్ని పక్కన పెడితే.. అన్నగారికి, బాలయ్య కు ఉన్న ప్రధాన లక్షణం.. సమయానికి షూటింగుకు వెళ్లిపోవడం. అప్పట్లో అన్నగారు ఉదయం 6 గంటలకు షూటింగ్ అంటే.. గంట ముందే.. అక్కడ ఉండి మేకప్ పనులు పూర్తి చేసుకునేవారు.
ఇక, బాలయ్య కూడా అంతే.. ఔట్ డోర్ అయినా.. ఇన్డోర్ అయినా టైం అంటే టైమే. ఇదే సమయంలో అన్నగారిలో మరో లక్షణం కూడా ఉంది. ఆ రోజు షెడ్యూల్ ప్రకారం తనతో పాటు నటించేవారు.. కూడా టైం కు రావాలని పట్టుబట్టే వారు. “నేను ముందు రావడం.. వారు వెనుక రావడం.. ఏంటి? టైం అంటే టైమే.. వెయిట్ చేయడం ఎందుకు?“ అని ఖరాకండీగా చెప్పేవారట. ఒక సినిమా షూటింగులో అంజలీదేవి షూటింగుకు రావడం ఆలస్యమైంది.
దీంతో అన్నగారు కారాలు మిరియాలు నూరడంతోపాటు.. షెడ్యూల్ ఆలస్యమైంది కనుక.. దేవిగారికి కోతపెట్టి.. ఆ సొమ్ము నాకివ్వండి..! అని పంతం పట్టారని గుమ్మడి రాసుకున్నారు. అచ్చం ఇటీవల బాలయ్య కూడా ఇలానే వ్యవహరించారు. తన సినిమా షూటింగ్ కోసం..రావాల్సిన హీరోయిన్(పేరు చెబితే బాగోదు) ఏకంగా డుమ్మా కొట్టింది. ఈ విషయం డైరెక్టర్‌కు, నిర్మాతకు కూడా చెప్పలేదు.
దీంతో బాలయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి.. ఇంకోసారి ఇలా జరిగితే.. అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఎంతైనా.. అన్నగారి తనయుడు కదా ఆ మాత్రం డిసిప్లిన్ ఉండాలిగా అనేశారు నిర్మాత, దర్శకులు. అలాగే ఎన్టీఆర్‌లా హీరోయిన్లకు ఎంతో గౌరవం ఇస్తాడు బాలయ్య. బాలయ్యతో సినిమా చేసిన ఏ హీరోయిన్ అయినా కూడా ఆయనతో కలిసి పనిచేయడం తమ గౌరవాన్ని కూడా పెంచుతుందని చెపుతుంటారు.