అల్లు రామలింగయ్య అనగానే క్యామెడీకి కేరాఫ్. ఆయన కనిపిస్తే చాలా ప్రేక్షకులు మంత్రముగ్ధలై పోతారు. ఇక, ఆయన డైలాగ్ డెలివరీ కూడా అంతే. అనేక సినిమాల్లో అల్లు, ఎన్టీఆర్ కలిసి నటించారు. అయితే, అల్లు ఎక్కువగా క్యారెక్టర్ పాత్రలకే పరిమితం కావడంతో ఒకటి రెండు షెడ్యూళ్లలో మాత్రమే కలిసి నటించేవారు. ఆ తక్కువ సమయంలోనే ఏర్పడిన పరిచయం.. అన్నగారికి అల్లుకు మధ్య ఎనలేని బంధాన్ని ఏర్పరిచింది.
పైకి.. అల్లు రామలింగయ్య క్యామెడీగా అనిపించినా.. అప్పట్లో మేధావిగా ఆయనను పరిగణించేవారు. ఏదీ కూడా ఒక పట్టాన ఆయన ఒప్పుకొనేవారు కాదు. ముఖ్యంగా రావు గోపాలరావు, ప్రభాకర్‌రెడ్డి వంటివారితో అల్లుకు ఎంతో అనుబంధం ఉండేది. వారి ఇళ్లలో ఏ కార్యక్రమం జరగాలన్నా.. అల్లు ఉండాల్సిందే. ఆయన చేతుల మీదుగానే కొన్ని కొన్ని కార్యక్రమాలు కూడా జరిగాయి. ఇలా.. రావు గోపాలరావుతో సహా అల్లు అన్నగారింట్లో వారాంతాలు గడిపేవారు.
అన్నగారికి ఒక విలక్షణత ఉంది. కేవలం నటించడం.. ఇంటికి వెళ్లిపోవడం కాదు. ఎవరిలోనైనా.. ఏదైనా ప్రత్యేక ప్రతిభ ఉంటేదానిని వెలికి తీసేవారు. ఇలా.. అల్లు రామలింగయ్యలో హోమియో పతి వైద్యం చేసే ప్రతిభను రావు గోపాలరావు ఒక సందర్భంలో అన్నగారికి చెప్పారు. ఓరోజు అన్నగారికి నలతగా ఉన్న సమయంలో అనుకోకుండా..రావుతో కలిసి అల్లు అన్నగారి ఇంటికి వచ్చారు. ఈ సమయంలో ఆయన నాడి పట్టుకుని చూసి.. హోమియోపతి మందును ఇచ్చారు. ఆ వెంటనే అన్నగారు కోలుకున్నారు.
తర్వాత… అన్నగారు అధికారంలోకి వచ్చిన తర్వాత .. సినీ పరిశ్రమ ఆయనను ఘనంగా సత్కరించింది. ఈ క్రమంలో రావు, అల్లు, ప్రభాకర్‌రెడ్డి, శోభన్‌బాబులను అన్నగారు ఇంటికి పిలిచి.. ప్రత్యేక విందు ఇచ్చారు. ఈ సందర్భంలోనే..గత వైద్యాన్ని గుర్తుచేసుకున్న ఎన్టీఆర్ అల్లు ఆధ్వర్యంలో రాష్ట్రంలో హోమియో పతి వైద్యాన్ని విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాలని అనుకున్నారు. దీనిపై చర్చించారు కూడా. దీనికి అల్లు కూడా ఒప్పుకొన్నారు. కానీ, పార్టీలోని కొందరు నాయకులు (వీరికి పెద్ద పెద్ద వైద్య శాలలు ఉన్నాయి) పడనివ్వలేదు. దీంతో ఆ ప్రతిపాదన అక్కడితో ఆగిపోయింది.