భానుప్రియ..ఈ సీనియర్ హీరోయిన్ పేరు వినగానే ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు గుర్తొస్తాయి. ముఖ్యంగా ఆమె కెరీర్ ప్రారంభంలో నటించిన సితార సినిమా..ఆ సినిమాలోని భానుప్రియ పర్ఫార్మెన్స్..ఆమె కాటుక కళ్ళు..ఇలా ఎన్నో కళ్ళముందు కదలాడతాయి. కూచిపూడి డాన్సర్ కావడంతో భానుప్రియకి సీనియర్ డైరెక్టర్ వంశీ తన సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత అన్నీ భాషలలో కలిసి ఆమే దాదాపు 110 సినిమాలలో హీరోయిన్గా నటించారు. శ్రీదేవి అంటూ అభిమానులు భానుప్రియను పిలుస్తుంటారు.
ఆమె మంచి కూచిపూడి డాన్సర్ కావడం కెరీర్ ప్రారంభంలో వరుసగా ఆఫర్స్ రావడానికి బాగా తోడ్పడింది. రెండవ సినిమానే అగ్ర దర్శకులు కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో చేసే ఛాన్స్ అందుకున్నారు. ఆ సినిమానే స్వర్ణకమలం. ఈ సినిమా కూడా భానుప్రియకి మంచి పేరును తెచ్చిపెట్టింది. ఇలాంటి క్లాసిక్స్ చేసి సౌత్‌లో మంచి పాపులారిటీ తెచ్చుకున్న ఆమె మెగాస్టార్ చిరంజీవి సరసన బ్రేక్ డాన్స్ చేసి కమర్షియల్‌గా మారుతుందని ఏ ఒక్కరూ ఊహించలేదు.
స్టేట్ రౌడీ సినిమాలో భానుప్రియ డాన్స్ మరో రేంజ్ అని చెప్పాలి. అయితే, కొన్ని సినిమాలలో కొన్ని సాంగ్స్‌లో భానుప్రియ ఓవర్‌గా పర్ఫార్మ్ చేస్తారనే టాక్ ఉండేది. మంచి నాజూకు పర్సనాలిటీ కావడంతో ఎలాంటి డాన్స్ మూవ్మెంట్ అయినా అద్భుతంగా చేసేవారు. ముఖ్యంగా చిరంజీవి అంటే డాన్స్‌కి పెట్టింది పేరు. అలాంటి హీరోతో సమానంగా డాన్స్ చేసి మెప్పించాలనే తపనతో కాస్త ఓవర్ చేసేవారని అప్పట్లో ఓ నెగిటివ్ టాక్ ఉండేది.
అంటే రూపాయి పర్ఫార్మెన్స్ చేయాలంటే నాలుగు రూపాయల పర్ఫార్మెన్స్ చేసేవారని కామెంట్స్ చేసేవారు. కానీ, భానుప్రియ చేసిన సినిమాలు..వాటిలోని పాటలు చూస్తే అలా అనిపించదు. సీనియర్ అయ్యాక కూడా మోహన్ బాబు సరసన పెదరాయుడు లాంటి సినిమాలు చేసి ఆకట్టుకున్నారు. అలాగే ఛత్రపతి సినిమాలో ప్రభాస్ తల్లిగా అద్భుతమైన పాత్రను చేసి ఆకట్టుకున్నారు. ఏదేమైనా గొప్ప పర్ఫార్మర్స్లలో భానుప్రియ ఒకరు అని ఒప్పుకొని తీరాలి.