తెలుగు వారి విశ్వరూపం, విశ్వ విఖ్యాత నటుడు ఎన్టీఆర్‌ది పెద్ద కుటుంబం. ఆయనకు ఏకంగా ఎనిమిది మంది సంతానం. అయితే.. వీరిలో ఎవరూ కూడా ఉన్నత స్థాయిలో చదువుకోలేదు. ఒక్కరు ఇద్దరు తప్ప.. మిగిలిన వారికి పెద్దగా చదువులు అబ్బలేదు. బాలకృష్ణ సినిమాలపై మోజుతో అన్నగారి వెంటే వచ్చేయగా.. హరికృష్ణకు ఆదిలో సినిమా ఛాన్సులు వచ్చినా.. తర్వాత తగ్గిపోయాయి. దీంతో వారికి చదువులు అబ్బలేదు.
ఇక, ఆడపిల్లలకు కూడా పెద్దగా చదువులు లేవు. దీనిపై ఎన్టీఆరే నిందలు మోయాల్సి వచ్చిందని గుమ్మడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. తన పిల్లలు అమెరికా వెళ్లి చదువుకున్నారని ఆయన చెప్పారు.
అయితే, ఎన్టీఆర్ పిల్లలు మాత్రం హైదరాబాద్‌కే పరిమితం అయ్యారని.. ఎవరూ కూడా ఉన్నతస్థాయిలో చదువుకోలేదన్నారు. అందుకే.. ఎన్టీఆర్ తన పిల్లలకు ముఖ్యంగా ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయాల్సి వచ్చినప్పడు ఉన్నత విద్యావంతులకే ఇచ్చి పెళ్లిచేశారని తెలిపారు.
ఇక, ఈ విషయంలో అన్నగారిపై వచ్చిన వివాదాలు.. కుటుంబంలో కలహాలను కూడా.. గుమ్మడి వివరించారు. అంతా మీ వల్లే అంటూ.. ఒకానొక సందర్భంలో పిల్లలు ఆయనకు ఎదురు తిరిగారని తాము చదువుకోక పోవడానికి అన్నగారే కారణమని పేర్కొన్నారని గుమ్మడి వివరించారు. అయితే.. నిజానికి అన్నగారు సినిమాల్లో బిజీగా ఉన్నా.. కావాల్సినంత డబ్బులు మాత్రం ఇచ్చేవారని.. తెలిపారు.
ఎక్కడ లోపం జరిగిందో ఏమో.. ఎన్టీఆర్ కుటుంబం మాత్రం ఉన్నత చదువులకు దూరంగా ఉండిపోయిందని తెలిపారు. ఇది ఎన్టీఆర్‌ను కూడా చాలా రోజులు బాధించిందని పేర్కొన్నారు. అయితే.. అప్పటికే పిల్లలు పెద్దవాళ్లు కావడంతో .. చదువులు లేకపోయినా.. తినడానికి, ఉండడానికి లోటు లేదుకదా.. అని సరిపుచ్చుకునేవారని గుమ్మడి తాను రాసుకున్న పుస్తకంలో పేర్కొన్నారు.
అందుకే.. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత.. పేద పిల్లలకు విద్య విషయంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారని, ముఖ్యంగా తెలుగుకు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారని వివరించారు. కుటుంబంలో తాను ఎదుర్కొన్న పరిస్థితులు సమాజంలో ఎదురు కాకుండా ఉండాలని కోరుకునేవారని గుమ్మడి తెలిపారు.