నందమూరి బాలకృష్ణ నటించిన సినిమాలలో ఒక్కమగాడు ఒకటి. 2008 సంక్రాంతి కానుకగా నందమూరి వంశ వీరాభిమాని అయిన వైవీఎస్ చౌదరి ఈ సినిమాను తన బ్యానర్లోనే నిర్మించి దర్శకత్వం వహించారు. అప్పటికే చౌదరి నందమూరి హీరో హరికృష్ణతో సీతారామరాజు, సీతయ్య, లాహిరి లాహిరి లాహిరిలో సినిమాలు తీసి హిట్ కొట్టారు. ఈ మూడు సినిమాలు హరికృష్ణ కెరీర్‌ను ఆ వయస్సులోనూ నిలబెట్టడంతో బాలయ్యకు చౌదరిపై గురి కుదిరింది.
అలా ఒక్క మగాడు ప్రాజెక్ట్ సెట్ అయ్యింది. అప్పటికే ఫామ్‌లో ఉన్న అనుష్కతో పాటు బాలయ్యకు లక్కీ హీరోయిన్ సిమ్రాన్, బాలీవుడ్ నుంచి నిషా కొఠారీ లాంటి ముగ్గురు ముద్దుగుమ్మలను హీరోయిన్లుగా తీసుకున్నారు. అసలు ఈ సినిమా రిలీజ్‌కు ముందు జరిగిన హంగామా అంతా ఇంతా కాదు. అప్పటికే దర్శకుడు చౌదరి వరుస హిట్లు ఇవ్వడంతో ఒక్క మగాడు రికార్డులు బద్దలు కొడుతుందని నందమూరి అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.
అయితే సినిమాపై అంచనాలు భారీగా ఉండడం.. ఆ అంచనాల్లో సగం కూడా అందుకునేలా లేకపోవడంతో అట్టర్ ప్లాప్ అయ్యింది. సినిమాలో బాలయ్య మేకప్, గ్రాఫిక్స్, టెక్నికల్ విలువలపై పెట్టిన శ్రద్ధ కథపై పెట్టలేదు. దీంతో సినిమా ప్లాప్ అయ్యింది. ఈ సినిమా కథ నరసింహనాయుడు, భారతీయుడు రెండు సినిమాల్లోని హీరోల పాత్రలను మిక్స్ చేసినట్టుగా ఉందన్న విమర్శలు వచ్చాయి.
సినిమాలో బాలకృష్ణ ఓ చేతితో కరెంట్ తీగ పట్టుకుని.. మరో చేతితో ముగ్గురు వ్యక్తులను పట్టుకుంటాడు. ఆ కరెంట్ షాక్‌తో బాలకృష్ణ పట్టుకున్న ముగ్గురు వ్యక్తులు చనిపోయినా హీరోకు మాత్రం ఏం కాదు. పైగా నవ్వుతూ కనిపిస్తాడు. ఇలాంటి సీన్లు బాలయ్య ఇమేజ్‌ను దెబ్బతీయడంతో పాటు ఈ సినిమా ప్లాప్‌తో దర్శకుడు చౌదరి పరువు మొత్తం పోయింది. సినిమా ప్లాప్ అయ్యాక బాలయ్య సైతం చౌదరిపై నువ్వు చెప్పిన కథేంటి.. తీసిన సినిమా ఏంటని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడని టాక్ ?
ఆ తర్వాత బాలయ్య దెబ్బతోనే చౌదరి చాలా యేళ్ల పాటు మళ్లీ సినిమాలు చేయలేదని అంటారు. ఆ సినిమా తర్వాత చౌదరి కెరీర్ అథః పాతాళంలో పడిపోయింది. ఇక ఒక్క మగాడు సినిమా రిలీజ్ టైంలో ఆంధ్రప్రదేశ్‌లో బాలయ్య అభిమానులు చేసిన హడావిడి, హంగామా సంచలనం అయ్యింది. అప్పట్లో అదో ట్రెండ్ సెట్ చేసింది. గన్నవరంలో అయితే జాతీయ రహదారిని ఆనుకుని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు పెద్ద సంచలనం అయ్యాయి.
గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అతి పొడవైన ఫ్లెక్సీలతో బాలయ్య అభిమానులు రికార్డులు బద్దలు కొట్టారు. సినిమా రిలీజ్ వారం రోజుల ముందు నుంచే పండగ చేసుకున్నారు. తీరా ఫస్ట్ డే ఫస్ట్ షో చూశాక వారి ఆశలు నీరు కారిపోయాయి. అలా బాలయ్య కెరీర్‌లో ఒక్క మగాడు ఓ పీడకలగా మిగిలింది.