మేటి గాయని సునీత ఓ షార్ట్ ఫిలిం (లఘుచిత్రం)లో నటిస్తున్నారు అన్న వార్త ఇటీవలి కాలంలో మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ అయ్యింది. సునీత కథానాయికగా నటిస్తున్నారు అంటూ ప్రచారం సాగింది. అయితే ఎట్టకేలకు సునీత నటించిన లఘుచిత్రం `రాగం` అఫీషియల్‌గా లాంచ్ అయ్యింది. హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్‌లో ఈ లఘుచిత్రాన్ని ప్రముఖుల కోసం ప్రదర్శించారు. కార్యక్రమంలో వర్ధమాన గాయనీగాయకులు, నటీనటులు పాల్గొన్నారు.
`రాగం` హృదయాన్ని టచ్ చేసే ఓ సింపుల్ స్టోరి. ఒంటరి మహిళ అనగానే సమాజం దృక్పథం ఎలా ఉంటుంది? పెళ్లయి భర్తకు దూరంగా ఉండే మహిళ విషయంలో చుట్టూ ఉన్నవాళ్లు ఎలా అపార్థం చేసుకుంటారు? అన్న ఓ రియలిస్టిక్ పాయింట్‌ని ఎంతో హుందాగా ఆవిష్కరించారు ఈ లఘుచిత్రంలో. ముఖ్యంగా సునీత నటన, ఆహార్యం అద్భుతం. సహజసిద్ధమైన నటనతో ఆకట్టుకున్నారు. అలాగే నటుడు సమీర్ కథానాయిక స్నేహితుడి పాత్రలో, సాయి కిరణ్ నాయిక భర్త పాత్రలో, సాటి గాయకుడిగా ఎంతో ఒదిగిపోయి నటించారు. సునీల్ కశ్యప్ రీరికార్డింగ్, మెలోడి ఆహ్లదకరమైన ఫీల్‌ని తెచ్చింది. దర్శకురాలు శ్రీచైతు ఓ సెన్సిటివ్ పాయింట్‌ని ఎలివేట్ చేసిన తీరు ఎంతో ఇంట్రెస్టింగ్. లఘుచిత్రాలు అనగానే ఏవో వెకిలిగా ఉండే పాయింట్‌ను ఎంచుకుని లైటర్ వెయిన్‌లో కామెడీలు, బూతు జోకులతో సినిమా తీసేస్తే ఆన్‌లైన్‌లో లైక్‌లు కొట్టేయొచ్చు అనుకునే వారికి ఇదో కనువిప్పు కలిగించే అర్థవంతమైన ప్రయత్నం.
`రాగం` లఘుచిత్రానికి ఛాయాగ్రహణం: విశ్వనాథ్ డి.బి, ఎడిటింగ్: గార్రీ బిహెచ్, సంగీతం: సునీల్ కశ్యప్, దర్శకత్వం: శ్రీచైతు.