Moviesబాల‌య్య‌కు త‌న సినిమాల్లో బాగా ఇష్ట‌మైన సినిమా ఏదో తెలుసా...!

బాల‌య్య‌కు త‌న సినిమాల్లో బాగా ఇష్ట‌మైన సినిమా ఏదో తెలుసా…!

ఒక మూస ఫార్ములాతో కొనసాగుతున్న తెలుగు సినిమా చరిత్ర గతిని మార్చిన సినిమా బాలయ్య సమరసింహారెడ్డి. అప్పటివరకు తెలుగు సినిమా సక్సెస్ ఫార్ములా అంటే ప్రేమ, రొమాన్స్, పాటలు, ఫైట్లు, ఫ్యామిలీ కథ వీటి చుట్టూనే తెలుగు సినిమా తిరిగేది. ప్రేక్షకులు కూడా ఈ ఫార్ములాలతో సినిమాలు తీస్తేనే ఆదరించేవారు. అలాంటి మూస ఫార్ములా నుంచి బయటకు వచ్చి పవర్ఫుల్ యాక్షన్ కథతో తెరకెక్కి టాలీవుడ్ లో ట్రెండ్ సెట్ చేసింది సమరసింహారెడ్డి.

శ్రీ సత్యనారాయణమ్మ ప్రొడక్షన్స్ పతాకంపై పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే చంగల వెంకటరావు ఈ సినిమాను నిర్మించారు. అప్పటికే బాలయ్యతో లారీ డ్రైవర్ – రౌడీ ఇన్స్పెక్టర్ లాంటి రెండు సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించిన బి.గోపాల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సినిమాకు దర్శ‌క‌ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. సింధూరపువ్వు అనే తమిళ సినిమా నుంచి సమరసింహారెడ్డి మెయిన్ లైన్ తీసుకుని దానికి బాలీవుడ్‌లో వచ్చిన హిట్ సినిమా దుష్మన్ తరహా యాక్షన్ కథనాన్ని జోడించారు.

ఈ సినిమా కథను విజయేంద్రప్రసాద్ ముందుగా బొంబాయి మాఫియా నేపథ్యంలో రాయాలని అనుకున్నారు. అయితే అప్పుడు విజయేంద్రప్రసాద్ కు అసిస్టెంట్ గా పని చేస్తున్న రత్నం సలహా మేరకు రాయలసీమ నేపథ్యాన్ని ఎంచుకున్నారు. 1999 సంక్రాంతి కానుకగా మెగాస్టార్ చిరంజీవి నటించిన స్నేహం కోసం సినిమాకు పోటీగా వచ్చిన సమరసింహారెడ్డి సూపర్ హిట్ అవడంతో పాటు ఇండస్ట్రీ హిట్ అయింది.

అప్పటివరకు తెలుగు సినిమా చరిత్రలో ఉన్న రికార్డులు అన్నింటిని తిరగరాస్తు ఏకంగా 77 కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకుంది. ఆ తర్వాత బాలయ్య తన రికార్డును తానే తిరగరాస్తు నరసింహనాయుడు సినిమాతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేశారు. అయినా కూడా బాలయ్య నరసింహనాయుడు కంటే సమరసింహారెడ్డి సినిమాయే ఎక్కువగా ఇష్టపడతారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చాలా సార్లు చెప్పారు.

తాను నటించిన సినిమాలలో సమరసింహారెడ్డి తనకు అత్యంత ఇష్టమైన సినిమా అని బాలయ్య పలుమార్లు వెల్లడించారు. బాలయ్య తన కెరీర్లో పౌరాణికం – జానపదం- సాంఘికం – యాక్షన్ – ప్రేమ‌కథా సినిమాల్లో నటించినా ఆయనకు సమరసింహారెడ్డి సినిమా అంటే ఎంతో మక్కువ. ఆ సినిమాతోనే బాలయ్య సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ ఫుల్‌గా స్టార్ట్ అయిందని చెప్పాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news