సినీ రంగంలో ధృవ నక్షత్రంగా మిగిలిపోయిన.. అన్నగారు ఎన్టీఆర్ ను అనుసరించిన నటులు.. ఆయనను దైవంగా ఆరాధించిన నటులు చాలా మంది ఉన్నారు. అయితే.. వీరిలో ఎవరూ కూడా అన్నగారితో విభేదించిన వారు లేరు. కానీ, ఒకరిద్దరు మాత్రమే అన్నగారిని కాదని మరీ.. సినీరంగంలో ఉన్నారు. ఇలాంటి వారు కూడా తర్వాత కాలంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సినీ రంగంలో తమ ప్రభావం కోల్పోయారు. ఈ పరిణామాలతో సినీరంగంలో అన్నగారి ప్రభావంపై అనేక సందర్భాల్లో చర్చ సాగింది. కానీ, ఒకే ఒక్కరు మాత్రం అన్నగారితో విభేదించి మరీ విజయం దక్కించుకున్నారు.
ఆయనే పద్మనాభం. ఆదిలో అన్నగారి పక్కన హాస్యనటుడుగా ఎంట్రీ ఇచ్చిన పద్మనాభం.. తర్వాత కాలంలో ప్రొడక్షన్ కంపెనీ పెట్టుకున్నారు. `రాధా మురళీ కంబైన్స్` అనే సంస్థను స్థాపించారు. నిజానికి అన్నగారి రూంలోనూ పద్మనాభం కూడా కలిసి ఉండేవారట. తర్వాత..అన్నగారు కొన్నాళ్లకు సొంత ఇల్లు కొనుక్కుని చెన్నై టీనగర్‌కు మారిపోయారు. దీంతో ఆ రూంలో పద్మనాభం, రాజబాబు.. వంటివారు ఉండేవారు. అయితే.. అన్నగారితో కలిసి మెలిసిన తిరిగినా.. అన్నగారి కంటే.. కూడా ఆర్థికంగా.. బలమైన పంథాలో ముందుకు సాగారు పద్మనాభం.
ఈ క్రమంలోనే అత్యంత త్వరగా.. ఆయన సినీ రంగంలో నిలదొక్కుకున్నారు. సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. అదేవిధంగా కొంత వాటా సొమ్ముతో ఒక స్టూడియోను కూడా నిర్మించారు. ఇదిలావుంటే.. తన సినిమాల్లో తొలి దానిని.. ఎన్టీఆర్‌తో చేయించాలని.. ఆయనను హీరోగా చూడాలని పద్మనాభం అనుకున్నారు. కానీ, ఇది కుదరలేదు. దీంతో అన్నగారితో కాకుండా.. తనే స్వయంగా మర్యాద రామన్న చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇక, ఆ తర్వాత.. అన్నగారితో సినిమా చేయాలనే ఆలోచన కూడా ఆయనకు రాలేదు. ఎందుకంటే.. పద్మనాభం కామెడీ కమ్ హీరోయిజంను అభిమానులు ఆదరించారు.
ప్రస్తుతం ఆలీ మాదిరిగా! ఇక, ఆ తర్వాత.. అన్నగారితో ఆయన నటించిన చిత్రాలు గగనమనే చెప్పాలి. అయితే.. సినీ రంగంలో అన్నగారితో విభేదించారనే పేరు మాత్రం వచ్చింది. ఎందుకంటే.. తొలి చిత్రంలో అన్నగారికి కుదరక నటించకపోయినా.. ఈ విషయాన్ని ఎందుకో.. పద్మనాభం దాచారు. “అన్నగారు నటించనన్నారు“ అనే ప్రచారం తెరమీదికి తెచ్చారు. దీంతో అప్పటి నుంచి అన్నగారికి ఆయనకు మధ్య పెద్దగా మాటలు కూడా లేవని అంటారు.