సినిమా ఇండస్ట్రీలో కొందరు చేయాల్సిన సినిమాలను మరో హీరో చేసి హిట్లు, ప్లాపులు కొడుతుండడం కామన్. అనుకోకుండా కొన్ని కారణాల వల్ల ఓ హీరో వదులుకున్న కథతో మరో హీరో సినిమా చేసి బ్లాక్‌బస్టర్ కొడితే ఆ కథ ముందు వదులుకున్న హీరోకు, ఆయన అభిమానులకు పెద్ద డిజప్పాయింటే. ఈ క్రమంలోనే నందమూరి బాలకృష్ణతో చేద్దాం అనుకున్న ఓ కథ రూటు మారి మరో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ దగ్గరకు వెళ్లింది. అలా ఆ సినిమా బ్లాక్‌బస్టర్ కొట్టేసింది.
1990వ దశకంలో బాలయ్య, వెంకటేష్ ఇద్దరూ మంచి హిట్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. ఈ క్రమంలోనే పరుచూరి సోదరులు.. బి. గోపాల్ కాంబినేషన్లో ఓ సినిమా సెట్ అవుతోంది. బాలయ్యకు ఏ పట్టాన ఓ కథ సెట్ కావడం లేదు. అప్పుడు బి. గోపాల్ తమిళంలో చిన్నతంబి అనే సినిమా వచ్చింది. పి. వాసు దర్శకుడు.. ఆ సినిమా చూశాను.. చాలా బాగుంది.. మీరు కూడా చూడండి.. బాలయ్యతో చేస్తే బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుందని చెప్పాడు.
మరుసటి రోజు పరుచూరి సోదరులు చిన్నతంబి సినిమా చూసి బాలయ్యతో చేస్తే ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందనే చెప్పారు. పరుచూరి సోదరుల ఇది బాలయ్యకు ఏకంగా సిల్వర్ జూబ్లి సినిమా అవుతుందని కూడా చెప్పేశారు. తీరా ఈ సినిమా రైట్స్ కొందాం అని డిసైడ్ అయినప్పుడు అసలు విషయం తెలిసింది. ఈ సినిమా రీమేక్ రైట్స్‌ను క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కేఎస్. రామారావు కొనేసి విక్టరీ వెంకటేష్‌తో తీస్తున్నారని తెలిసింది.
దీంతో బాలయ్య చేయాల్సిన ఈ సినిమా ఆయన నుంచి చేజారింది. కేఎస్. రామారావు వెంకటేష్ హీరోగా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో చంటిగా రీమేక్ చేస్తే ఆ సినిమా సూపర్ డూపర్ బ్లాక్‌బస్టర్ అయ్యింది. వెంకటేష్‌కు జోడీగా మీనా నటించింది. ఈ సినిమాలో వెంకీ అమాయకపు నటన ప్రేక్షకులను కట్టి పడేసింది. వెంకీకి ఉత్తమ నటుడిగా అవార్డు రాగా.. ఎస్పీ. బాలుకు ఉత్తమ గాయకుడి అవార్డు లభించింది.
తమిళంలో హీరోయిన్గా చేసిన ఖుష్బూ మళ్లీ అదే పాత్రను తెలుగులో వెంకటేష్ పక్కన చేసేందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆ ప్లేస్‌లో మీనాను తీసుకున్నారు. ఈ సినిమా విజయవంతం అయ్యి 40 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సినిమాను కన్నడంలో రామాచారి పేరుతో రీమేక్ చేశారు. ఇక హిందీలో అనారీ పేరుతో తీయగా.. అక్కడ కూడా వెంకటేషే హీరోగా చేశాడు.