ఎన్టీఆర్ కెరీర్లో విభిన్నమైన సినిమాల్లో యమగోల ఒకటి. తాతినేని రామారావు దర్శకత్వంలో 1977లో వచ్చిన ఈ డివైన్ కామెడీ సూపర్ హిట్ అయ్యింది. బెంగాల్లో సూపర్ హిట్ అయిన యమాలయే మానుష్ ఈ సినిమాకు మాతృక. ఆ సినిమా నుంచి రీమేక్ చేసి యయగోల తెరకెక్కించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ వెంకటరత్నం ఈ సినిమాతో నిర్మాతగా మారారు. ఈ సినిమాకు మాటలు, అనువాదం చేసిన డివి. నరసరాజుకు మంచి పేరు తీసుకువచ్చింది.
అయితే ఈ సినిమాలో యముడిగా ఎన్టీఆర్, హీరోగా ఆయన తనయుడు బాలకృష్ణ చేయాలి. చివరకు యముడిగా కైకాల సత్యనారాయణ, హీరోగా ఎన్టీఆర్ చేశారు. అయితే బాలకృష్ణ ఈ సినిమా నుంచి తప్పుకోవడానికి కారణం ఎన్టీఆరే. అసలు విషయంలోకి వెళితే ముందుగా యమగోల టైటిల్‌తో సినిమా తీయాలని దర్శకుడు సి. పుల్లయ్య అనుకున్నారు. ఎన్టీఆర్ హీరోగా పుల్లయ్య దర్శకత్వంలో దేవాంతకుడు సినిమా వచ్చింది.
ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. యమధర్మరాజు టైప్‌లోనే దేవాంతకుడు సినిమా తీశారు. దేవాంతకుడు సినిమాలో ఎస్వీ. రంగారావు అద్భుతమైన నటన కనపరిచారు. ఈ క్రమంలోనే సీ పుల్లయ్య కుమారుడు యమగోల కథ డవలప్ చేసి నరసరాజుకు చెప్పారు. ఆయనకు కథ నచ్చకపోవడంతో పక్కన పెట్టేశారు. ఈ సినిమా, టైటిల్ హక్కులను నిర్మాత రామానాయుడు కొన్నారు. ఆ తర్వాత కథ మొత్తం విన్న రామానాయుడికి కూడా కొన్ని డౌట్లు ఉండడంతో ఆయన కూడా దీనిని పక్కన పెట్టేశారు.
అలా 17 ఏళ్ల పాటు ఈ కథ హక్కులు రామానాయుడు దగ్గరే ఉన్నాయి. ఆ తర్వాత ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌గా ఉన్న వెంకటరత్నం రామానాయుడు దగ్గర నుంచి ఈ సినిమా రైట్స్ కొన్నారు. చివరకు మళ్లీ ఈ స్టోరీని రచయిత డివి. నరసరాజు చేత డవలప్ చేయించి, మాటలు రాయించారు. దేవాంతకుడు సినిమాను ఎన్టీఆర్‌తో తీసినందున.. యమగోల సినిమాను ఆయన తనయుడు బాలకృష్ణతో చేస్తే బాగుంటుందని అనుకున్నారు.
యముడిగా ఎన్టీఆర్.. హీరోగా బాలకృష్ణ అనుకున్నారు. అయితే అప్పటకీ బాలకృష్ణ సొంత బ్యానర్లో తప్పా బయట సినిమాల్లో నటించేందుకు ఎన్టీఆర్‌కు ఇష్టం లేదు. ఆ కారణంతోనే బాలయ్యను ఈ ప్రాజెక్ట్ నుంచి ఎన్టీఆరే స్వయంగా తప్పించేశారు. చివరకు యముడిగా కైకాల సత్యనారాయణను ఆయనే రిఫర్ చేశారు. హీరోగా ఎన్టీఆర్ చేయగా.. జయప్రద హీరోయిన్గా నటించింది. తాతినేని రామారావు దర్శకత్వంలో వచ్చిన యమగోల సూపర్ డూపర్ హిట్ అయ్యింది.