తెలుగు జాతి ఉన్నంత కాలం దివంగత మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ సినీనటుడు ఎన్టీఆర్‌పై వాళ్లకు చెక్కు చెదరని అభిమానం ఉంటుంది. అంత బలమైన ముద్ర వేసిన ఘనత ఒక్క ఎన్టీఆర్‌కు మాత్రమే దక్కుతుంది. నాటి రాజకీయాలకు భిన్నంగా ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించి ఓ సరికొత్త ఒరవడి క్రియేట్ చేశారు. అంతేకాకుండా పార్టీ పెట్టిన 9 నెలలకే అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు.
తెలుగు ప్రజల్లో చాలా మంది.. ఈ తరంలోనూ ఎన్టీఆర్‌పై అంతే చెక్కు చెదరిని అభిమానం ప్రదర్శిస్తూ ఉంటారు.
తెలుగు ప్రజల మనస్సుల్లో అంతలా చెరగని ముద్ర వేసుకున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆంధ్రా లేదు.. తెలంగాణ, హైదరాబాద్, టెక్సాస్, డల్లాస్ ఇలా దేశం, రాష్ట్రం, ప్రాంతం, కులం అన్న తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు అందరూ ఓ పండగలా చేసుకున్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు కార్యక్రమాలు చేపట్టారు.
అయితే ఎక్కడా లేనట్టుగా ఆంధ్రా ప్యారీస్‌గా పిలుచుకునే తెనాలిలో ఓ థియేటర్ యాజమాన్యం ఇప్పుడు ఎన్టీఆర్‌పై తమకు ఉన్న అమితప్రేమను చాటుకుంది. ఈ థియేటర్ తీసుకున్న నిర్ణయం నెవ్వర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్ అనుకోకుండా ఉండలేం. ఎన్టీఆర్‌కు తెనాలికి ఎంతో అనుబంధం ఉంది. ఇక్కడ ఇప్పుడు యూవీ క్రియేషన్స్ వాళ్లు నిర్వహిస్తోన్న లక్ష్మీ, శ్రీలక్ష్మి థియేటర్లను ఎన్టీఆర్ స్వయంగా ఓపెన్ చేశారు. అప్పుడు ఎన్టీఆర్ ఇంకా రాజకీయాల్లోకి రాలేదు.
ఇక తెనాలిలో ఎన్టీఆర్ కట్టించిన పెమ్మసాని థియేటర్ ఉంది. ఇప్పుడు రామకృష్ణ థియేటర్‌గా ఉన్న ఈ థియేటర్లో యేడాది పాటు వారానికి ఐదు రోజుల పాటు ఎన్టీఆర్ సినిమాలు ఉచితంగా ప్రదర్శిస్తారు. ప్రతి రోజు ఉదయం 9 గంటలకు ఈ ఉచిత సినిమా ప్రదర్శన ఉంటుంది. ఈ ఫ్రీ ప్రదర్శన ఎన్టీఆర్ తనయుడు నందమూరి నటసింహం బాలకృష్ణ చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి. ఇది ఎన్టీఆర్‌కు నిజంగా ఇచ్చే ఘనమైన నివాళి అని చెప్పాలి.
శని, ఆదివారాలు మినహా మిగిలిన అన్ని రోజుల్లోనూ రామకృష్ణ థియేటర్లో ప్రతి రోజు ఉదయం 9 గంటల షో ఎన్టీఆర్ ఉచిత సినిమా ప్రదర్శన ఉంటుంది. ఎన్టీఆర్‌కు ఇది నిజమైన శతజయంతి కానుక అని చెప్పాలి. ప్రపంచ చిత్ర పరిశ్రమలో మరే నటుడికి ఇంత ఘనమైన ఉత్సవాన్ని నిర్వహించలేదని చెప్పాలి.