నందమూరి నటసింహం బాలకృష్ణకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. బాలయ్యది అంతా మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్. మాస్ బాలయ్య సినిమాలు అంటే పడిచస్తారు. దీనికి తోడు తండ్రి ఎన్టీఆర్ నుంచి వచ్చిన నందమూరి ఫ్యాన్ బేస్ కూడా బాలయ్యకు ఎప్పుడూ బలమైన పునాదిగా ఉంటుంది. బాలయ్య తన సినిమాలతో ముందు ఎవరిని శాటిస్‌పై చేసినా చేయకపోయినా ఫ్యాన్స్‌ను సంతృప్తి పరిస్తే చాలు సినిమా గట్టెక్కేసినట్టే. ఇక బాలయ్య – బోయపాటి కాంబినేషన్ అంటే ఎంత క్రేజ్ ఉంటుందో చెప్పక్కర్లేదు.
వీరిద్దరి కాంబోలో 2010లో సింహా, 2014లో లెజెండ్.. గతేడాది అఖండ సినిమాలు వచ్చాయి. ఈ మూడు సినిమాలు ఒకదానిని మించి మరొకటి హిట్ అయ్యాయి. బాలయ్య కెరీర్ ప్రతిసారి డౌన్‌లో ఉన్నప్పుడు బోయపాటి సినిమాలు వచ్చి రచ్చ రచ్చ చేశాయి. సింహాకు ముందు వరకు బాలయ్య ప్లాపుల్లో ఉన్నాడు. నిజం చెప్పాలంటే 2004లో వచ్చిన లక్ష్మీనరసింహా తర్వాత బాలయ్య రేంజ్‌కు తగ్గ హిట్ పడలేదు.
అయితే ఆరేళ్ల తర్వాత బాలయ్య అభిమానుల ఆకలి సింహా తీర్చింది. మళ్లీ నాలుగేళ్ల పాటు బాలయ్యకు తగ్గ హిట్ పడలేదు. 2014 మార్చిలో వచ్చిన లెజెండ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. పైగా ఏపీలో ఎన్నికలకు ముందు రావడంతో ఆ సినిమా ఇచ్చిన స్ఫూర్తి నందమూరి, తెలుగుదేశం అభిమానులకు మంచి టానిక్‌లా ఉపయోగపడింది. ఈ సినిమాలో బాలయ్య వర్సెస్ జగపతిబాబు మధ్య యుద్ధం.. పులి, సింహం మధ్య వార్ జరిగితే ఎలా ? ఉంటుందో ? అలా జరిగింది.
లెజెండ్ తర్వాత బాలయ్య – బోయపాటి కాంబోలో హ్యట్రిక్ పడాలని.. పడుతుందని నందమూరి అభిమానులు అప్పుడే ఫిక్స్ అయిపోయారు. అయితే 2014 తర్వాత కాస్త లేట్‌గా 2021 చివర్లో అఖండ సినిమా వచ్చింది. కరోనా కష్టకాలం దాటుకుని థియేటర్లలోకి వచ్చిన అఖండ అఖండ జాతర మోగించేయడంతో పాటు థియేటర్లలో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేసింది. ఫైనల్గా బాలయ్య – బోయపాటి కాంబినేషన్లో అందరూ అనుకున్నట్టుగా హ్యాట్రిక్ పూర్తయ్యింది.
ఇక ఈ మూడు సినిమాలు 175 రోజులు పూర్తి చేసుకోవడం కూడా మరో రికార్డే. ఒకే హీరో, ఒకే దర్శకుడు కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవ్వడం అరుదైన రికార్డే. సింహా సినిమా జమ్మలమడుగు అలంకార్ – ఆదోనీ ప్రభాకర్ థియేటర్లతో పాటు వైజాగ్‌లోని గోపాలపట్నం మౌర్య డీలక్స్‌లో 175 రోజులు ఆడింది. బాలయ్య లెజెండ్ సినిమా ఎమ్మిగనూరు మినీ శివ, ప్రొద్దుటూరు ఆర్వేటి + అర్చనలో కలుపుకుని 175 రోజులు ఆడింది. లెజెండ్ అయితే ప్రొద్దుటూరులో ఏకంగా 1000 రోజులు ఆడి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
ఇక బాలయ్య అఖండ 103 కేంద్రాల్లో 50 రోజులు… 20కు పైగా కేంద్రాల్లో 100 రోజులు.. ( 4 కేంద్రాల్లో డైరెక్ట్ 100 రోజులు.. అందులో 3 కర్నూలు జిల్లాలోనే ఉన్నాయి ) ఆడింది. ఇక ఈ సినిమా కూడా తాజాగా డైరెక్టుగా 4 ఆటలతో 175 రోజులు ఆడింది. చిలకలూరిపేట రామకృష్ణా థియేటర్లో 175 రోజులు పూర్తి చేసుకున్న అఖండ ఇప్పుడు 200 రోజుల వైపు పరుగులు పెడుతోంది. ఈ అరుదైన రికార్డ్ ఒక్క బాలయ్య ఖాతాలోనే పడింది.