దివంగత విశ్వవిఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు తెలుగు వాళ్లు ఎప్పటకీ గర్వించదగ్గ వ్యక్తి. ఎన్టీఆర్ కేవలం నటుడు మాత్రమే కాదు.. తెలుగు ప్రజల ఆరాధ్య నాయకుడు.. ఆయన తన సినిమాలతో మాత్రమే కాదు… రాజకీయంగా కూడా జాతీయ స్థాయిలో ఎన్నో సంచలనాలు క్రియేట్ చేశారు. ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకుల్లో ఎంతో మందికి ఆయనే జన్మఇచ్చారు. ఏపీ, తెలంగాణలో ఎన్టీఆర్ జన్మనిచ్చిన రాజకీయ నాయకులు ఎలాంటి కీలక పదవుల్లో కొనసాగుతున్నారో ? చూస్తూనే ఉన్నాం.
ఇక ఎన్టీఆర్ తన కెరీర్‌లో మొత్తం 295 సినిమాల్లో నటించారు. ఇందులో 278 సినిమాలు తెలుగు సినిమాలు. సీనియర్ ఎన్టీఆర్ నటించిన తొలి సినిమా మనదేశం. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఇన్‌స్పెక్టర్ రోల్లో నటించారు. ఈ పాత్రకే ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కాయి. సీనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన తొలి సినిమా పల్లెటూరి పిల్ల. బి.ఏ సుబ్బారావు డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కింది.
ఇక కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన గుండమ్మకథ సీనియర్ ఎన్టీఆర్ 100వ సినిమా. యోగానంద్ దర్శకత్వం వహించిన కోడలు దిద్దిన కాపురం ఎన్టీఆర్ కెరీర్‌లో వచ్చిన 200వ సినిమా. ఇక ఎన్టీఆర్ కెరీర్‌లో చివరి బ్లాక్‌బస్టర్ హిట్ కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన మేజర్ చంద్రకాంత్. అయితే చివరగా రిలీజ్ అయిన సినిమా శ్రీనాథ కవిసౌర్వభౌమ.
ఇక అప్పటి రేట్ల ప్రకారం చూస్తే సీనియర్ ఎన్టీఆర్ నటించిన మొత్తం అన్ని సినిమాల వసూళ్లు రు. 300 కోట్లకు కాస్త అటూ ఇటూగా ఉంటాయట. అయితే ఇప్పటి రేట్ల ప్రకారం వాటిని లెక్కిస్తే ఆ కలెక్షన్ల విలువ రు. 10, 000 కోట్లకు పైనే ఉంటుందట. ఇక సీనియర్ ఎన్టీఆర్ తన సినిమాలలో ఎన్నో పౌరాణిక, సాంఘీక పాత్రల్లో నటించారు. ఎన్టీఆర్ రాముడి పాత్రలో తొలిసారి నటించిన సినిమా చరణదాసి. ఇక ఎన్టీఆర్ ఆనాడే పాన్ ఇండియా సినిమా చేశారు. అదే చండీరాణి. ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ అయ్యింది.
1964లో సీనియర్ ఎన్టీఆర్ ఏకంగా 16 సినిమాల్లో నటించారు. ఆయన నటించిన అగ్గిరాముడు సినిమా నుంచే సినిమా కలెక్షన్లు ప్రకటించే సంప్రదాయం మొదలైంది. 1963లో రిలీజ్ అయిన లవకుశ సినిమా తొలి రంగుల సినిమాగా రికార్డులకు ఎక్కింది. 1950లో రిలీజ్ అయిన మాయారంభ ఎన్టీఆర్ నటించిన తొలి పౌరాణిక చిత్రం. ఎన్టీఆర్ కేవలం హీరోగా మాత్రమే కాకుండా.. దర్శకుడిగా.. నిర్మాతగా కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు.