ఎవరు నిజం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పవన్ సినిమా అంటేనే పెద్ద గందరగోళం అన్నట్టుగా ఉంది. అసలు పవన్ ఎంచుకునే కథలు, డైరెక్టర్లు చూస్తేనే పవన్ ఫ్యాన్స్‌కు చిర్రెత్తుకు వచ్చేస్తోంది. పవన్ పోటీ హీరోలు, తోటి హీరోలు, చివరకు ఎన్టీఆర్, బన్నీ, చెర్రీ లాంటి వాళ్లు కూడా కొత్త కథలు, టాప్ డైరెక్టర్లు, పాన్ ఇండియా రేంజ్ సినిమాలు చేసుకుంటూ పోతుంటే పవన్ తన స్థాయికి తగిన కథలు ఎంచుకోకుండా.. వేరే భాషల్లో హిట్ అయిన సినిమాలను ఇక్కడ రీమేకులు చేసుకుంటూ పోతున్నాడు.
పవన్ ఎంచుకుంటోన్న కథలు, డైరెక్టర్లతో పవన్ సినిమాలంటేనే రిలీజ్‌కు ముందే ఆసక్తి ఉండడం లేదు. ఇదిలా ఉంటే పవన్ సినిమాల్లో కాస్త ఆసక్తి ఉన్న సినిమా హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ – క్రిష్ కాంబినేషన్లో నిర్మాత ఏఎం. రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పవన్‌తో గతంలో 2001లో ఖుషీ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ నిర్మాత రత్నం తీశారు. ఆ తర్వాత 2006లో బంగారం తీశారు.
బంగారు అనుకున్నట్టుగా ఆడకపోవడంతో నిర్మాత రత్నం తనకు మరో సినిమా చేయమని పవన్ కు అప్పుడే అడ్వాన్స్ ఇచ్చారు. అంటే ఇప్పుడు 16 ఏళ్ల తర్వాత రత్నంకు పవన్ సినిమా చేస్తున్నారు. అయితే ఇంత సుధీర్ఘంగా షూటింగ్ జరుపుకుంటోన్న సినిమా ఇదే అనుకోవాలి. పదే పదే షెడ్యూల్స్ వేస్తున్నా అవి పూర్తవ్వడం లేదు. రత్నం కూడా పాపం ఆ సెట్లకు రెంట్ కట్టుకుంటూ.. ఆ భారం భరిస్తూ వస్తున్నారు.
ఇవన్నీ ఇలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా క్వాలిటీపై పవన్ అసంతృప్తితో ఉన్నారన్న గాసిప్‌లు కూడా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ సినిమా సెట్లు, కాస్ట్యూమ్స్ చాలా లోగా ఉన్నాయని పవన్ నేరుగా క్రిష్ దగ్గరే అసంతృప్తి వ్యక్తం చేశారట. బడ్జెట్ ప్రాబ్లమ్ వల్ల కూడా ఇలా జరిగిందని అంటున్నారు. అసలే నిర్మాత రత్నం ఈ సినిమాపై భారీ పెట్టుబడులు పెట్టి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారట.
అందుకే సినిమా ఎంత త్వరగా ఫినిష్ చేస్తే తాను అంత త్వరగా బయట పడతానని ఆయన భావిస్తున్నా పవన్ మాత్రం షూటింగ్ ఓ పట్టాన ముందుకు కదలనీయడం లేదట. మరో టాక్ ఏంటంటే తనకు చెప్పిన సీన్లు కాకుండా.. మరోలా తీస్తున్నావేంటని కూడా క్రిష్‌ను ప్రశ్నించారని అంటున్నారు. దసరాకు రిలీజ్ అంటున్నా చాలా వర్క్ ఉందనే తెలుస్తోంది.
ఏపీలో పొలిటికల్ మూమెంట్ పెరిగితే పవన్ మరింత బిజీ అయిపోతాడు. ఓ వైపు ఈ సినిమా షూటింగ్‌తో పాటు అటు హరీష్ శంకర్ సినిమాకు కూడా డేట్లు ఇస్తున్నారు. ఇక సముద్రఖని సినిమాకు కూడా డేట్లు వచ్చే నెల నుంచి ఇస్తానని చెప్పాడట. ఈ లెక్కన హరిహర వీరమల్లు ఎప్పుడు వస్తుందో ? ఎవ్వరికి అంతు పట్టని ప్రశ్నగా మారింది.