సీనియర్ నటుడు రాజశేఖర్ నటించిన మళయాళ రీమేక్ సినిమా శేఖర్ ఈ రోజు రిలీజ్ అయ్యింది. జీవిత దర్శకత్వం వహించిన ఈ సినిమా కాస్తో కూస్తో మంచి ప్రి రిలీజ్ బజ్‌తో ఈ రోజు రిలీజ్ అయ్యింది. సినిమాపై ఉన్న నమ్మకంతో జీవిత దంపతులు ప్రమోషన్లు కూడా బాగానే చేశారు. అయితే ఈ సినిమా రిలీజ్ రోజే జీవిత దంపతులకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. గత కొంత కాలంగా జీవిత దంపతులపై ఆరోపణలు చేసుకుంటూ వస్తోన్న జోస్టర్ ఎంటర్‌ప్రైజర్స్ ఎండీ హేమ, గరుడవేగ నిర్మాత కోటేశ్వరరాజు మరోసారి వీరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇప్పుడు వీరి విమర్శలే ఎక్కడ చూసినా వైరల్ అవుతున్నాయి. గురువారం జీవిత మీడియాతో మాట్లాడుతూ గరుడవేగ సినిమాకు సంబంధించి తాము భారీగా డబ్బు ఎగ్గొట్టామని కొందరు ఆరోపణలు చేస్తున్నారని.. అదే నిజమని మీడియా తనతో పాటు తన కుటుంబ సభ్యులపై కూడా ఏవేవో ఆరోపణలు చేస్తూ, అసత్య కథనాలు రాస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
జీవిత రాజశేఖర్ కౌంటర్ నేపథ్యంలో హేమ, ఆమె భర్త కోటేశ్వరరాజు మరోసారి మీడియా ముందుకు వచ్చి జీవితపై తీవ్రమైన ఘాటు ఆరోపణలు చేశారు. జీవిత పెద్ద సైలెంట్ కిల్లర్ అని.. ఆమె అబద్ధాలతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తమకు పరువు , ప్రతిష్ట ఉన్నాయని.. అసలు జీవిత ముందుగా మేం ఎవరో తెలియదని చెప్పారని కూడా హేమ అన్నారు.
ఈ క్రమంలోనే జీవిత రాజశేఖర్‌కు ఆమె ఐదు ప్రశ్నలు కూడా వేశారు. నా వద్ద అప్పులు తీసుకున్నావా ? లేదా ? అప్పు కోసం ఆస్తి పత్రాలు తాకట్టు పెట్టారా ? లేదా ? అని నిలదీశారు. తనకు క్షమాపణ చెప్పారా ? లేదా ? అని కూడా ప్రశ్నించారు. డబ్బు తీసుకుని జవాబుదారి తనం లేకుండా వ్యవహరిస్తున్నారంటూ హేమ మండిపడ్డారు. తమకు న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని.. ఇంత జరుగుతున్నా జీవిత ఎందుకు నోరు విప్పడం లేదని ఆమె ప్రశ్నించారు.
జీవిత రాజశేఖర్ 420 వేషాల గురించే తాము మాట్లాడుతున్నామని.. నిర్మాతలను అవమానించే రీతిలో వారు మాట్లాడుతున్నారని.. జీవిత నిజ జీవితంలో కంటే సినిమాల్లో నటిస్తే బాగుంటుందని కోటేశ్వరరాజు హితవు పలికారు. ఏదేమైనా వారు ఎన్నో ఆశలు పెట్టుకున్న శేఖర్ రిలీజ్ రోజునే ఈ విధంగా వారిని టార్గెట్ చేయడం కాస్త ఇబ్బందే అని చెప్పాలి.