నందమూరి నటసింహం బాలయ్య గురించి పలువురు రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఆయనకు కోపం ఎక్కువ అని అందరూ పైకి చెపుతూ ఉంటారు. అయితే ఆయన్ను కలిసి మాట్లాడినవారు మాత్రం బాలయ్యది ఎంత మంచి మనస్సో చెపుతారు. తాజాగా సీనియర్ జర్నలిస్టు భరద్వాజ బాలయ్య గురించి మాట్లాడుతూ ఆయన మంచి మనస్తత్వంపై కామెంట్లు చేశారు.
బాలయ్య స్టార్ హీరో అయినా అస్సలు ఆ గర్వం.. ఆ భావనే ఆయనకు ఉండదని భరద్వాజ చెప్పారు. సీనియర్ ఎన్టీఆర్ ఎంతో సింపుల్‌గా ఉండేవారని… బాలయ్యకు కూడా తండ్రి నుంచి అదే స్వభావం వచ్చిందని భరద్వాజ అన్నారు. పబ్లిక్ ఫంక్షన్స్‌లో ఆడియెన్స్ నుంచి స్టేజ్‌మీదకు వెళ్లడం అనే కల్చర్ ఎన్టీఆర్‌తో స్టార్ట్ అయ్యిందని.. బాలయ్య కూడా దానినే ఫాలో అయ్యేవాడట.
సీనియర్ ఎన్టీఆర్ ప్రతి రోజు ఉదయం అరగంట పాటు ఫ్యాన్స్, పబ్లిక్‌తో మాట్లాడేవారట. బాలయ్య కూడా ఇదే అలవాటు చేసుకున్నారని… నిర్మాత ఇబ్బందుల్లో ఉంటే బాలయ్య వెంటనే తన రెమ్యునరేషన్ తగ్గించేసుకుంటారని.. నిర్మాత తక్కువ రెమ్యునరేషన్ ఇస్తానన్నా కూడా బాలయ్య సినిమా చేసేవాడని భరద్వాజ వెల్లడించారు. సీనియర్ ఎన్టీఆర్ అయినా రెమ్యునరేషన్ విషయంలో పట్టింపుతో ఉండేవారు కాని.. బాలయ్యకు మాత్రం అలాంటి పట్టింపులు లేవన్నారు. ఈ విషయంలో ఇండస్ట్రీలోనే బాలయ్య నెంబర్ వన్ అన్నారు.
బాలయ్య డైరెక్టర్ మనిషి అని.. ఓ సారి కథకు ఓకే చెప్పాక డైరెక్టర్ ఏది చెపితే అదే బాలయ్య చేసుకుంటూ పోతారని భరద్వాజ తెలిపారు. సీనియర్ ఎన్టీఆర్, బాలయ్య ఇద్దరూ కూడా ఇతరుల సినిమాల్లో ఎప్పుడూ వేలు పెట్టేవారు కాదన్నారు. పలనాటి బ్రహ్మనాయుడు సినిమాలో తొడగొట్టే సీన్‌ను బాలయ్య వద్దని చెప్పినా దర్శకుడు పట్టుబట్టడంతోనే బాలయ్య చేయాల్సి వచ్చిందన్నారు.
బాలయ్యకు బయట ఒకటి.. లోపల ఒకటి ఉండదని.. ఆయన రూమ్‌లో ఏం మాట్లాడతాడో ? ఫోన్లో కూడా అదే మాట్లాడతాడు అని భరద్వాజ అన్నారు. బాలయ్యది మంచి మనస్తత్వం అని భరద్వాజ ఆకాశానికి ఎత్తేశారు.