గత కొంత కాలంగా తెలుగు సినిమాలో నటీనటుల రెమ్యునరేషన్లు బాగా పెరిగిపోతున్నాయి. ఎందుకంటే డిజిటల్ ఆదాయం పెరిగింది… థియేటర్, శాటిలైట్ ఆదాయం తగ్గుతోంది… మరో వైపు నిర్మాణ వ్యయం పెరుగుతోంది.. ఇటు హీరోయిన్ల రెమ్యునరేషన్లు కూడా పెరిగిపోతుండడంతో నిర్మాతలు తమ సినిమాను ఏరియాల వారీగా ఎక్కువ రేట్లకు అమ్ముకోవడం మామూలు అయిపోయింది. ఇదే ఇప్పుడు ఆంధ్రాలో తెలుగు సినిమాకు ప్రమాద ఘంటికలు మోగిస్తోందని అంటున్నారు.
హీరోలు రెమ్యునరేషన్లు తగ్గించుకోరు. వాళ్లు ఏకంగా రు. 40 – 50 కోట్ల రేంజ్లో రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారు. దీంతో నిర్మాతలకు భారీగా చేతిచమురు వదులుతోంది. చివరకు పెద్ద హీరోల సినిమాలను నిర్మాతలు ఆంధ్రా ఏరియాలో 50 కోట్లు, నైజాంలో 30 కోట్ల రేంజ్లో అమ్ముతున్నారు. అయితే ఎంత పెద్ద హీరోల సినిమాలు అయినా.. నైజాంలో 30 కోట్లు సులువుగానే అందుకుంటున్నా.. ఆంధ్రాలో 50 కోట్లు రాబట్టుకోవడానికి కిందా మీదా పడుతున్నాయి.
పుష్ప, భీమ్లానాయక్, రాధేశ్యామ్, సర్కారు వారి పాట సినిమాలే ఇందుకు నిదర్శనం. ఎంత యావరేజ్, హిట్ టాక్ ఉన్నా ఆంధ్రా వరకు 50 కోట్లు కొల్లగొట్టడం అంటే జరగడం లేదు. అది త్రిబుల్ ఆర్ లాంటి సినిమాలకు మాత్రమే మినహాయింపు. అసలు సినిమా ఖర్చే రు. 130 – 150 కోట్ల రేంజ్లో ఉండడంతో నిర్మాతలు ఆ రేట్లకు అమ్ముకోక తప్పడం లేదు.
నైజాం వరకు హైదరాబాద్ పెద్ద సిటీ ఉండడంతో అక్కడ నుంచి పెద్ద సినిమాలకు హోల్ నైజాం రైట్స్‌లో సగం అమౌంట్ వస్తోంది. ఇటీవల తెలంగాణలో చాలా కొత్త రిలీజ్ సెంటర్లు రావడంతో పెద్ద హీరోల సినిమాలకు యావరేజ్ టాక్ ఉన్నా రు. 30 కోట్లు వస్తోంది. అయితే ఇప్పుడు ఆంధ్ర విషయానికి వస్తే ఆంధ్రా 30 కోట్లు, సీడెడ్ 10 కోట్లకు అమ్మితేనే బయ్యర్లు సేఫ్‌గా ఉంటారు.
నిజం చెప్పాలంటే గత ఆరు నెలల్లో రిలీజ్ చేసిన పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ చేసిన బయ్యర్లకు ఏం మిగల్లేదు. అయితే ఈ విషయం వారు బయటకు చెప్పుకలేకపోతున్నారంతే..! ఇప్పటకీ అయినా హీరోలు రెమ్యునరేషన్ తగ్గించుకోవడం, సినిమా నిర్మాణం ఖర్చు తగ్గకపోతే ఆంధ్రాలో కొన్నాళ్లకు బయ్యర్లు అనేవాడు ఉండడు. అది తెలుగు సినిమాకు పెద్ద షాకే అవుతుంది.