టాలీవుడ్లో ఇప్పుడు బయోపిక్‌లు.. చారిత్రాత్మక సినిమాలకు రూపకల్పన జరుగుతోంది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ బయోపిక్ ఇప్పటికే రెండు పార్టులుగా వచ్చింది. ఎన్టీఆర్ తనయుడు బాలయ్య స్వయంగా ఈ సినిమాలో నటించారు. కారణాలు ఏవైనా ఈ సినిమా అంచనాలు అందుకోలేకోయింది. రాజకీయంగా కూడా ఈ సినిమా టార్గెట్‌కు గురి కావడంతో ప్లాప్ అవ్వడానికి ప్రధాన కారణం.
ఇక పలువురు చారిత్రక యోధులు, సినిమా వాళ్లు, క్రీడాకారుల బయోపిక్‌లు తెరకెక్కించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ లెజెండ్రీ హీరోల్లో ఒకరు అయిన సూపర్ స్టార్ కృష్ణ బయోపిక్ కూడా తెరకెక్కించాలన్న డిమాండ్లు గత కొంత కాలంగా వినిపిస్తున్నాయి. తెలుగు సినిమా రంగంలో దిగ్గజ హీరోల్లో కృష్ణ కూడా ఒకరు.
ఆయన తెలుగు సినిమా రంగంలో ఎంతో చెరగని ముద్ర వేశారు. ఈ క్రమంలోనే ఆయన తనయుడు మహేష్‌బాబు సర్కారు వారి పాట సినిమా ప్రమోషన్లలో తన తండ్రి బయోపిక్‌పై స్పందించాడు. తన తండ్రి బయోపిక్ సాధ్యాసాధ్యాల గురించి మాట్లాడని మహేష్ అలాంటి ప్రయత్నం జరిగిన రోజు ఆ సినిమాను తానే స్వయంగా నిర్మిస్తానంటూ ప్రకటించాడు. అయితే ఆ సినిమాలో తాను నటించలేనని మాత్రం చెప్పేశాడు.
ఎన్టీఆర్ బయోపిక్‌లో ఆయన తనయుడు బాలయ్య నటించారు. పైగా ఆయన సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు. నాగార్జున తన తండ్రి బయోపిక్‌పై పెద్దగా ఆసక్తి చూపించరు. తన తండ్రి బయోపిక్కు సంబంధించిన ఆయన జీవితంలో అనుకున్నంత ఎత్తుపల్లాలు లేవని నాగ్ ఇప్పటికే ప్రకటించారు. అప్పట్లోనే ఎన్టీఆర్, ఏఎన్నార్లకు పోటీగా ఇండస్ట్రీలో నిలిచిన కృష్ణ బయోపిక్కు కావాల్సినంత డ్రామా ఆయన జీవితంలో ఉంది.
ఈ బయోపిక్ తెరకెక్కితే అంతకన్నా కావాల్సింది ఏం ఉంటుంది. అయితే మహేష్ తానే ఈ సినిమా నిర్మిస్తానని ప్రకటించడం ద్వారా సంచలనం రేపాడనే చెప్పాలి. ఇక తన బాలీవుడ్ ఎంట్రీ గురించి మాట్లాడుతూ తనకు అలాంటి ఆసక్తి లేదని కుండబద్దలు కొట్టేశాడు. తన దృష్టంతా టాలీవుడ్ మీదే ఉందని చెప్పకనే చెప్పాడు.