విశ్వవిఖ్యాత నటసౌర్వభౌమ ఎన్టీఆర్ సినిమా రంగంలోనే కాకండా రాజకీయ రంగంలో కూడా తిరుగులేని హీరోగా ఉన్నారు. ఎన్టీఆర్ ఎంత ఎత్తుకు ఎదిగినా క్రమశిక్షణ విషయంలో ఆయనకు ఆయనే సాటి. ఓ సినిమా షూటింగ్ విషయంలో ఏ ఒక్కరి వల్ల ఏ ఒక్కరు ఇబ్బంది పడకూడదు అన్నదే ఆయన సిద్ధాంతం. అందుకే ఆయన షూటింగ్ ఉదయం 6 గంటలకు ఉందంటే 5.45 గంటలకే ఆయన సెట్స్‌లో ఉండేవారట. ఆ క్రమశిక్షణే తండ్రి నుంచి బాలయ్య కూడా అలవరుచుకున్నాడు. బాలయ్య కూడా క్రమశిక్షణ విషయంలో ఏ మాత్రం రాజీపడడు అన్న విషయం తెలిసిందే.
సినిమా రంగంలోకి వచ్చాక ఎన్టీఆర్‌కు వరుస హిట్లు పడుతున్నప్పుడు ఆయనకు క్రమం తప్పకుండా అవకాశాలు వచ్చాయి. ఆ టైంలో ఎన్టీఆర్ రోజుకు మూడు షిప్టుల చొప్పున పని చేసేవారట. ఒకేసారి రెండు సినిమాల షూటింగ్‌లో ఆయన పాల్గొనేవారు. అంతటి బిజీ షెడ్యూల్లో ఎన్టీఆర్ ఆహార శైలీచాలా కఠినంగా ఉండేదట. అప్పట్లో ఎన్టీఆర్ తిండి గురించి ఎక్కువ మంది చర్చించుకునేవారట.
అరచేతి మందంతో ఉన్న 20 ఇడ్లీలను ఎన్టీఆర్ ఉఫ్‌మని ఊదేసేవారట. ఒక్కోసారి ఉదయం టిఫిన్ చేసేటప్పుడు 10 – 15 ఇడ్లీలు తింటే.. తర్వాత మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు మరో ఐదారు ఇడ్లీలు లాగించేసేవారట. ఇక షాట్‌లో చిన్న గ్యాప్ వస్తే ఆయన వెంటనే ఆపిల్ జ్యూస్ తాగేవారట. ఎన్టీఆర్‌కు ఆపిల్ జ్యూస్ అంటే చాలా ఇష్టం. పైగా మద్రాస్‌లో ఆపిల్ పండ్లు ఏయే ప్రాంతాల్లో ఎక్కువుగా దొరుకుతాయి.. ఎక్కడ పండ్లు బాగా బాగుంటాయో కూడా చెప్పి మరి అక్కడివే తెప్పించుకునేవారట.
ఇక రోజుకు సగటున 3 – 5 బాటిల్స్ ఆపిల్ జ్యూస్ ఉండాల్సిందే. ఇక సాయంత్రం సమయంలో స్నాక్స్ గా బజ్జీలు తినేవారట. స్నాక్స్‌లో బజ్జీలు తీసుకోవడం అంటే ఎన్టీఆర్‌కు మహా ఇష్టం అట. ఇక డ్రైఫ్రూట్స్ తినేందుకు కూడా ఎన్టీఆర్ అమితాసక్తి చూపించేవారట. డ్రైఫ్రూట్స్ తింటే అలసట రాదని ఎన్టీఆర్ తోటి నటులకు, హీరోయిన్లకు చెప్పేవారట. ఇక ఎండాకాలం అయితే రెండు లీటర్ల బాదం పాలు కూడా ఆయన మెనూలో ఉండేదట.
సమ్మర్‌లో మధ్యాహ్న భోజనం తర్వాత మామిడి జ్యూస్ తాగేవారట. మామిడి జ్యూస్లో గ్లూకోజ్ వేసుకుని తాగడం అంటే ఎన్టీఆర్‌కు ఎంతో ఇష్టం అట. మామూలుగా ఈ స్థాయిలో ఆహారం తీసుకోవడం ఇప్పటి తరంలో ఎవ్వరి వల్లా కాదు. ఆయన ఎంత ఆహారం తీసుకున్నా కూడా ఆయన చేసే పనులు.. శారీరక శ్రమ వల్ల చాలా ఈజీగా అరిగిపోయేదని ఆయన సన్నిహితులు చెపుతూ ఉండేవారు.