తెలుగు సినిమా రంగంలో చాలా బ్యానర్లు మంచి కథాబలం, స్టార్ బలం ఉన్న సినిమాలు అందించి చరిత్రలో తమదైన ముద్ర వేసుకున్నాయి. ఉదాహరణకు వైజయంతీ మూవీస్, సురేష్ ప్రొడక్షన్స్ లాగా అప్పట్లో చందమామ విజయా కంబైన్స్, పూర్ణోదయ మూవీ క్రియేషన్స్, విజయా పిక్చర్స్ ఈ కోవలోనే రాజ్యమ్ పిక్చర్స్ బ్యానర్ కూడా ఉండేది. ఈ సంస్థ ఎన్నో విజయవంతమైన సినిమాలు ప్రేక్షకులకు అందించింది.
ఈ సంస్థకు చరిత్రలోనే నిలిచిపోయేలా శాశ్వత కీర్తిని తెచ్చిపెట్టిన సినిమా నర్తనశాల. అయితే రాజ్యం పిక్చర్స్‌కు సీనియర్ ఎన్టీఆర్‌కు ఎంతో అనుబంధం ఉండేది. ఈ సంస్థ నిర్మించిన తొలి సినిమా దాసిలోనూ.. చివరి సినిమా మగాడులో కూడా ఎన్టీఆరే హీరో. ఇక మగాడు సినిమా విషయానికి వస్తే హిందీలో అమితాబ్ నటించిన తీవార్ సినిమా ఆధారంగా తెరకెక్కించారు. ఎన్టీఆర్ – మంజుల హీరోయిన్లుగా నటించారు.
తీవార్ సినిమాలో మంజుల ఓ రొమాంటిక్ సీన్లో హీరో మీద కాలు వేస్తుంది. ఇదే సీన్ తెలుగులో తీసేటప్పుడు మంజుల ఎన్టీఆర్ మీద కాలు వేసేందుకు రెడీ అయిపోయారట. వెంటనే నిర్మాత లక్ష్మీరాజ్యం పెద్దాయన మీద అలా కాలు వేయకూడదమ్మా ? అని వారించారట. ఈ సినిమా కథ విషయానికి వస్తే 70వ దశకానికి అనుగుణంగా మార్చిన మదర్ ఇండియా కథలా ఉంటుందని అంటారు.
మదర్ ఇండియా సినిమాను తెలుగులో కూడా బంగారు కుటుంబం పేరుతో తీశారు. అందులో జమున, కృష్ణంరాజు, శోభన్‌బాబు నటించారు. అయితే ఆ సినిమా పల్లెటూరి నేపథ్యంలో సాగితే.. మగాడు నగరం నేపథ్యంలో సాగుతుంది. ఇద్దరు అన్నదమ్ముల్లో ఒకరు దొంగగా, చట్ట వ్యతిరేకిగా మారితే… మరోకరు పోలీస్ అవుతారు. వీరిద్దరి మధ్య సంఘర్షణలో నలిగిపోయే తల్లి పాత్ర ఉంటుంది.
ఇక ఈ సినిమాను తెలుగులో మగాడు టైటిల్‌తో తీయగా అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఈ సినిమా పరాజయంతో రాజ్యం పిక్చర్స్ చరిత్ర ముగిసిపోయింది. ఈ బ్యానర్‌పై ఎన్నో హిట్ సినిమాలు నిర్మించిన నిర్మాత లక్ష్మీరాజ్యం 1983లో మృతిచెందారు. ఆమె వారసత్వం మాత్రం పరిశ్రమలో కొనసాగింది.