పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ఎప్పటికీ గుర్తుండి పోయే చిత్రాల్లో `బద్రి` ఒకటి. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఈ సినిమాతోనే టాలీవుడ్లోకి అడుగు పెట్టాడు. విజయలక్ష్మీ ఆర్ట్ మూవీస్ బ్యానర్‌పై టి.త్రివిక్రమ్ రావు ఈ చిత్రాన్ని నిర్మించగా.. అమీషా పటేల్, రేణు దేశాయ్ హీరోయిన్లుగా నటించారు. ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం కీలక పాత్రలను పోషించారు. రమణ గోగుల అందించారు.
2000 ఏప్రిల్ 20న విడుదలైన ఈ చిత్రం తొలి రోజే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.అప్పటికే ఐదు సినిమాలు చేసి పీక్ స్టేజ్‌లో ఉన్న వపన్ బద్రితో పవర్ స్టార్‌గా అవతరించి యూత్‌లో భారీ ఫాలోయింగ్‌ను పొందాడు. అలాగే అప్పటి వరకూ ఉన్న మాస్ ఫార్ములాకి స్వస్తి చెప్పి.. సరికొత్త హీరోయిజాన్ని ప్రేక్షకుల రుచి చూపించి మొదటి సినిమాతోనే తానేంటో, తన సత్తా ఏంటో పూరీ నిరూపించుకున్నాడు.
`నువ్వు నంద అయితే.. నేను బద్రి బద్రీనాథ్` అంటూ ఈ మూవీలో పవన్ పలికే డైలాగ్ థియేటర్స్‌లో అభిమానులు పూనకాలు తెప్పించింది. మ్యూజికల్‌గానూ మంచి విజయం సాధించిన ఈ చిత్రంలో `హే చికితా.. గుమాస్తాస్`, `ఓ మిస్సమ్మా మిస్సమ్మా యమ్మా…` ఇప్పటికీ చాలా మంది హాట్ ఫేవరెట్ అని చెప్పాలి. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. బద్రిని పూరీ జగన్నాథ్ అసలు పవన్ కోసమే రాయలేదు. అవును, మీరు విన్నది నిజమే. ఈ సినిమా కథ పవన్ కంటే ముందు ఓ స్టార్ హీరో వద్దకు వెళ్లింది.
ఆ హీరోగా ఎవరో కాదు టాలీవుడ్ కింగ్ నాగార్జున. పూరీ ఆర్జీవీ వద్ద శిష్యరికం చేసిన సంగతి తెలిసిందే. ఆర్జీవీ, నాగార్జున మధ్య సన్నిహిత సంబంధాలు ఉండడంతో పూరీ నాగార్జునను ఊహించుకుని కథను రాసుకున్నారట. ఆపై నాగార్జునకు కథ వినిపించగా.. ఇతర ప్రాజెక్ట్స్ కారణంగా ఆయన రిజెక్ట్ చేశారట. దాంతో పూరీ పవన్ వద్దకు వెళ్లగా.. ఆయన క్లైమాక్స్ మార్చమని అడిగారట. కానీ, అందుకు పూరీ అంగీకరించలేదట. అయితే పూరీ కాన్ఫిడెన్స్ నచ్చి వెంటనే బ్రది చేయడానికి పవన్ ఒప్పుకున్నాడట.