కోట శ్రీనివాసరావు .. తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ సీనియర్ నటుడు. అప్పట్లో ఈయన ఎన్నో పాత్రలలో నటించి, ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కోట శ్రీనివాసరావు అంటే ఒక విలన్ గా మంచి గుర్తింపు కూడా ఉంది. విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు వేయని పాత్రలు లేవు. ఎలాంటి పాత్ర అయినా ఆయనకు కొట్టిన పిండే. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా పరభాషా చిత్రాలోనూ నటించి మెప్పించిన దిగ్గజ నటుడాయన.
ఇక ఈ పాత్రలో ఆయన తప్ప ఇంకెవరూ చేయలేరు అనేంతగా.. విలన్ గా ఆయన కొంతకాలం కొనసాగి, ఆ తర్వాత బాబు మోహన్ తో కలిపి పండించిన కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులకు ఇప్పటికీ కనువిందు చేస్తూనే ఉంటాయి. చాలా మంది నటులు ఈయనకు మంచి గౌరవం ఇస్తారు. తెలుగులో అరుదైన నటుడు అంటూ కీర్తిస్తారు. అంతేెకాదు.. కోటతో నటించడానికి గర్వపడతాం అంటూ చెప్పుకునే స్టార్ హీరోలు కూడా ఉన్నారు. 650కు పైగా సినిమాల్లో నటించిన కోట శ్రీనివాసరావు.. ‘ప్రాణం ఖరీదు’ చిత్రంతో పరిచయమయ్యారు. హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్గా తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక అధ్యాయాన్ని లిఖించుకున్నారు.
అప్పుడప్పుడు విలన్ గా దర్శనమిస్తూ , అప్పుడప్పుడు కమెడియన్ గా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూనే ఉంటారు. ఆయన డైలాగ్ డెలివరీని పట్టుకోవడం .. అందుకోవడం .. అనుకరించడం మరొకరికి సాధ్యం కాదు. ఒకానొక సమయంలో కోట లేని సినిమా అంటూ ఉండేది కాదు. అంతగా ఆయన చక్రం తిప్పేశారు.అయితే తన కొడుకు మరణాంతరం ఆయన కూడా పూర్తిగా మానసికంగా క్షోభ కు గురికావడంతో కొంతకాలం సినీ ఇండస్ట్రీకి దూరం కావాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయన వయోభారంతో బాధపడుతున్నారు. అందుకే, పాత్రలను ఆచితూచి ఎంపిక చేసుకుంటున్నారు.
తాజాగా కోట శ్రీనివాసరావు ఓ ఇంటర్వ్యుల్లో మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. వెంకటేష్ తో ఆయనకు ఉన్న సినిమా బంధం గురించి చెప్పుకొస్తు..” నేను వెంకటేష్ కలిసి నటించిన ఆల్ మోస్ట్ అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. మా ఇద్దరి కాంబో అంటే జనాలకు ఓ మార్క్ ఉంటుంది. మా కాంబోలో వచ్చిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఇప్పటికీ ఆ సినిమాను ప్రేక్షకులు చూసి నవ్వుకుంటున్నారు అంటే ఆ క్రెడిట్ అంతా ఈవీవీ సత్యనారాయణ గారిదే.
ఇక నా ఆల్ టైం ఫేవరేట్ హీరోయిన్ అంటే సౌందర్య. ఆమె అందం , నటన , మర్యాదా..గొప్ప నటి, గొప్ప మనిషి, క్రమశిక్షణ ..ఇతరులతో నడుచుకునే పద్ధతి ..నేను ఎప్పటికి మర్చిపోలేను.. హీరోయిన్ గా కన్నా కూడా ఆమె నా కూతురిగానే భావిస్తా.. నాకు నచ్చిన హీరోయిన్ అంటే అది సౌందర్యే. కానీ ఏం చేద్దాం చిన్న వయసులోనే దేవుడు ఆమెను తీసుకెళ్లిపోయాడు” అని చెప్పుకొచ్చారు కోట.