నందమూరి నటసింహం బాలయ్య అఖండ సినిమాతో ఏపీ, తెలంగాణలో ఉన్న థియేటర్లకు మాంచి ఊపు ఇచ్చాడు. నైజాం లేదు.. ఉత్తరాంధ్ర లేదు.. ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు ఇలా ఏ జిల్లా చూసినా కూడా జనాలు అఖండ మానియాతో ఊగిపోయారు. అఖండ తిరుగులేని బ్లాక్‌బస్టర్ కొట్టేసింది. బాలయ్య కెరీర్లో ఎన్నో ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి. ఆ హిట్లకు రాని క్రేజ్, వసూళ్లు అఖండ సొంతం చేసుకుంది. అఖండ ఓవరాల్‌గా రు. 150 కోట్ల థియేట్రికల్ వసూళ్లు కొల్లగొడితే.. రు. 200 కోట్ల టోటల్ వసూళ్లు రాబట్టింది.
అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో జనాలు 50 రోజుల పోస్టర్లనే మర్చిపోతున్నారు. అయినా అఖండ ఇండియాలోనే 103 కేంద్రాల్లో 50 రోజులు ఆడడం ఓ సంచలనం. పైగా కర్నాకట, ఇటు ఒడిశా, అటు మహారాష్ట్రలో షోలాపూర్ లాంటి చోట్ల కూడా అఖండ అర్థ శతదినోత్సవాలు జరుపుకుంది. ఇక 20కు పైగా కేంద్రాల్లో షిఫ్టింగ్లతో 100 రోజులు పూర్తి చేసుకుని.. కర్నూలులో గ్రాండ్‌గా శతదినోత్సవం పూర్తి చేసుకుంది.
అఖండ ఓవరాల్‌గా 4 కేంద్రాల్లో 100 రోజులు డైరెక్టుగా ఆడితే అందులో ఒక్క కర్నూలు జిల్లాలోనే మూడు సెంటర్లు ఉన్నాయి. కోవెలకుంట్ల, ఆదోని, ఎమ్మిగనూరులో 100 రోజులు ఆడింది. సీడెడ్ అంటేనే బాలయ్య సినిమాలకు అడ్డా. అందులో ఆదోనీ, ఎమ్మిగనూరు, నంద్యాల, కర్నూలు, ప్రొద్దుటూరు ఇవన్నీ బాలయ్య సినిమా అంటే 100 రోజులు ఆడాల్సిందే అన్నట్టుగా ఉంటుంది.
ఇక కర్నూలు, కడప జిల్లాలు కాకుండా గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట కూడా బాలయ్య సినిమాలకు అడ్డా. కేవలం బాలయ్య సినిమాలు మాత్రమే కాదు.. నందమూరి ఫ్యాన్స్ ఇక్కడ బాగా ఎక్కువ. నందమూరి హీరోల సినిమాలు ఇక్కడ సెంచరీలు బాదేస్తూ ఉంటాయి. కేఆర్ థియేటర్లలో ఫస్ట్ శతదినోత్సవం జరుపుకున్న సినిమాగా లెజెండ్ రికార్డులకు ఎక్కింది. కళ్యాణ్‌రామ్ పటాస్, చివరకు బాలయ్య ప్లాప్ సినిమా లయన్ కూడా ఇక్కడ 100 రోజులు ఆడింది.
తాజాగా చిలకలూరిపేట రామకృష్ణ థియేటర్లో అఖండ 100 రోజులు దాటేసి.. 140 రోజులు క్రాస్ చేసి 150 రోజుల వైపు పరుగులు తీస్తోంది. డైరెక్టుగా 4 ఆటల చొప్పున ఇక్కడ అఖండ ఇంకా నడుస్తోంది. ఇప్పటికే సినిమా రిలీజ్ అయ్యి ఐదు నెలలు కావొస్తోంది. ఓటీటీలోకి విధ్వంసం క్రియేట్ చేసింది. పలు చోట్ల వీథుల్లో అఖండను వేల సార్లు వేసేశారు. అయినా ఈ థియేటర్లో ఇంకా అఖండ 4 ఆటల చొప్పున ఆడుతోంది. ఇప్పటకీ ప్రతి షోకు జనాలు వస్తుండడంతో ఈ సినిమా 175 రోజుల దిశగా నడిపిస్తున్నారు.