కొందరు లెజెండరీలు నటించిన సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. సినీ చరిత్రలో ఆ సినిమాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఎంత కాలమైనా వాటి పేరు చెప్పగానే ఆ సినిమా సాధించిన విజయం తప్పక మదిలో మెదులుతుంది. ఇండస్ట్రీలో అవి క్లాసిక్‌గా మిగిలిపోతాయి. అయితే కాలక్రమంలో అదే సినిమా పేరు పెట్టుకుని మరో కొత్త తారాగణంతో కొత్త సినిమాలు వస్తుంటాయి. అయితే ఫలితం మాత్రం భిన్నంగా ఉంటుంది. ఈ కోవలో ఎన్టీఆర్ నటించిన ‘వేటగాడు’ సినిమా ఒకటి. అదే పేరుతో మరో హీరో సినిమా తీస్తే, బాక్సాఫీస్ వద్ద భిన్నమైన ఫలితం వచ్చింది.
అప్పటికే ‘అడవి రాముడు’ చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయం సాధించారు ఎన్టీఆర్. ఆ తర్వాత 1979లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో రోజా మూవీస్ అధినేత ఎం. అర్జున్ రావు నిర్మాతగా ఎన్టీఆర్ నటించిన ‘వేటగాడు’ సినిమా రిలీజ్ అయింది. అందులో ఎన్టీఆర్‌కు జోడీగా అందాల తార శ్రీదేవి నటించింది. వీరిద్దరి జోడీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా ఆ సినిమాలోని ‘ఆకుచాటు పిందె తడిసె’ పాట యావత్ తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.
ఇది జరిగిన కొన్నేళ్లకు వేటగాడు పేరుతోనే రాజశేఖర్ హీరోగా సినిమా వచ్చింది. 1956లో ఇంగ్లిష్‌లో ‘ఎ కిస్ బిఫోర్ డైయింగ్’ అనే సినిమా ఓ నవల ఆధారంగా రూపొందించారు. దానినే హిందీలో షారుక్ ఖాన్ హీరోగా ‘బాజీగర్’ సినిమా రూపొందించారు. ఈ రెండు చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఆ సినిమా హక్కులను తీసుకుని, తెలుగులో రాజశేఖర్ హీరోగా, సౌందర్య, రంభ హీరోయిన్లుగా వేటగాడు పేరుతో 1995లో సినిమా వచ్చింది. దీనికి నిర్మాత, దర్శకత్వ బాధ్యతలను తమ్మారెడ్డి భరద్వాజ తీసుకున్నారు.
ఈ సినిమాకు ఆశించిన విజయం దక్కలేదు. బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. ఈ సినిమా విషయంలోనే రాజశేఖర్‌కు, భరద్వాజ్‌కు మధ్య ఏవో పొరాపొచ్చలు వచ్చాయన్న ప్రచారం కూడా జరిగింది. ఇదే తరహాలో 1978లో ప్రముఖ దర్శకులు కె.బాలచందర్ ‘మరో చరిత్ర’ పేరుతో సినిమా తీశారు. అందులో కమల్ హాసన్, సరిత జంటగా నటించారు. విషాదాంతమైన ప్రేమకథతో కూడిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మరో చిత్ర అనేది ఇప్పటకీ.. ఎప్పటకీ ఓ క్లాసిక్.
ఈ సినిమాలోని పాటలు, సన్నివేశాలు ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో మెదులుతాయి. ఇదే సినిమా పేరుతో 2010లో తెలుగులో సినిమా వచ్చింది. అందులో వరుణ్ సందేశ్ హీరోగా, అనిత, శ్రద్ధా దాస్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత వ్యవహరించగా, రవి యాదవ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయం మూటగట్టుకుంది.