అబ్బబ్బ కేజీయఫ్ 2 సినిమా ఎంత పిచ్చపిచ్చగా నచ్చినా సినిమా చూస్తున్నంత సేపు అసలు మన కళ్ల ముందు తెరమీద చకచకా కదులుతోన్న ఆ షాట్స్ చూస్తుంటే పిచ్చెక్కిపోతూ ఉంది. క్షణాల్లో వేర్వేరు సీన్లు చకచకా వెళ్లిపోతున్నాయి. సినిమా చూస్తుంటే మనం సినిమా చూస్తున్నామన్న అనుభూతి కంటే సుమారు 50 కు పైగా ట్రైలర్స్‌ను క్రిస్పీగా కట్ చేసి చూపిస్తుంటే కన్నారప్పకుండా చూస్తున్నాం అన్న ఫీలింగ్ చాలా చోట్ల కలుగుతుంది.
అసలు ఈ సినిమాకు ఎడిటర్‌గా పనిచేయడం అంటే మామూలు విషయం కానే కాదు. సగటున క్షణానికి ఏకంగా 2 – 3 కట్స్ పడ్డాయి. ఒక్కోసారి కళ్లు కూడా స్టెయిన్ అయ్యేంతగా సీన్లు ట్రిమ్ చేశాడు. ఇదేదో కాసేపు అనుకుంటే ఓకే.. సినిమా మొత్తం ఇలాగే ఉంది. ఎవరబ్బా ఈ సినిమా ఎడిటర్ అని తర్వాత ఆరా తీస్తే ఈ సినిమా ఎడిటర్ 19 ఏళ్ల ఉజ్వల్ కులకర్ణి అని తేలింది. ఈ 19 ఏళ్ల బుడ్డోడికి ఈ సినిమా ఛాన్స్ ఎలా ? వచ్చింది. అసలు ఈ కథేంటని ఆరా తీస్తే చాలా ఇంట్రస్టింగ్ విషయాలు తెలిశాయి.
ఈ కుర్రాడి వయస్సు జస్ట్ 19. పేరు ఉజ్వల్ కులకర్ణి.. షార్ట్ ఫిలింస్ క్రిస్పీగా ఎడిట్ చేసేవాడు. డిగ్రీ చదువుతున్నాడు. అప్పుడప్పుడు ఎడిటింగ్‌కు పదును పెట్టుకుంటున్నాడు. ఈ కర్నాటక పిల్లగాడు షార్ట్ ఫిలింస్‌ను ఎడిట్ చేసుకుంటూ కొన్నాళ్లకు ఓ ఫ్యాన్ మేడ్ వీడియోను ఎడిట్ చేసి యూట్యూబ్‌లో పెట్టాడు. కేజీయఫ్ ఫస్ట్ పార్ట్ ఫ్యాన్ వీడియో ఎడిట్ చేశాడు.
అది దర్శకుడు ప్రశాంత్ నీల్ చూశాడు. ఎక్కడో నచ్చేసింది. ఉజ్వల్ ఫోన్ నెంబర్ సంపాదించి ఫోన్ చేశాడు. అటు వైపు నుంచి నేను ప్రశాంత్ నీల్‌ను అనగానే ఉజ్వల్ షాక్ అయిపోయాడు. ఓ సారి కలవమని కబురు పంపాడు. నీల్ మొదట ఓ పరీక్ష పెడదాం అనుకుని.. కేజీయఫ్ 2 కొన్ని బిట్లు ఇచ్చి ప్రోమో కట్ చేసి ఇవ్వమన్నాడు. నచ్చితే అదే టీజర్‌గా రిలీజ్ చేస్తానన్నాడు.
సడెన్ షాక్ నిజంగా ఉజ్వల్ కట్ చేసిన షాట్స్‌తోనే టీజర్ రిలీజ్ చేసిపడేశాడు. ఇంకేముందు కేజీయఫ్ 2 రషెస్ మొత్తం ఉజ్వల్ చేతుల్లో పెట్టేశాడు. నిర్మాతలు, బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు రిస్క్ వద్దన్నాడు. నీల్ నేనున్నా.. నన్ను నమ్మమన్నాడు. అసలు ఈ రోజు థియేటర్లో షాట్స్ చూస్తుంటే కళ్లు చెదిరిపోయాయి.. మైండ్ పోయింది.. మహామహా పెద్ద సినిమాలే ఎడిటింగ్ ఫెయిల్యూర్‌తో బొక్క బోర్లా పడుతున్నాయి.
అయితే ఈ 19 ఏళ్ల ఉజ్వల్ ఎడిటింగ్‌కు ఈ రోజు భారతీయ సినిమా ప్రేక్షకులు, తలలు పండిన టెక్నికల్ నిపుణులే ఫిదా అయిపోయారు. కేజీయఫ్ 2 అంత గ్రిప్పింగ్‌గా ఉందంటే అందుకు ఈ బుడ్డోడే కారణం. శబ్బాష్‌రా ఉజ్వల్.. నీకు బోల్డెంత భవిష్యత్తు బాకీ ఉంది.. దూసుకుపో…!