పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిమానులకు వరుస పెట్టి షాకుల మీద షాకులు ఇచ్చుకుంటూ పోతున్నాడు. వాస్తవం చెప్పాలంటే పవన్‌కు 2013లో వచ్చిన అత్తారింటికి దారేది మాత్రమే తన రేంజ్‌కు తగిన హిట్. అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని వకీల్‌సాబ్ చేశాడు. అది రీమేక్… పైగా పవన్ స్టైల్ కమర్షియల్ సినిమా కానే కాదు. పోనీ ఈ యేడాది చేసిన భీమ్లానాయక్ కూడా అంతే.. అది కూడా మళయాళ మూవీ అయ్యప్పనుం కోషీయమ్‌కు రీమేక్. ఈ సినిమా కూడా బ్రేక్ ఈవెన్ కాలేదు కొన్ని చోట్ల..! పవన్ ఫ్యాన్స్ ఇది రా మా హీరో సినిమా అని రొమ్ము ఇరగదీస్తూ చెప్పే సినిమా కానే కాదు.
ఇక లైన్లో ఉన్న సినిమాల్లో క్రిష్ హరిహర వీరమల్లు ఎప్పటకి పూర్తవుతుందో తెలియట్లేదు. మరోవైపు వరుసగా సినిమాలకు సైన్లు చేసుకుంటూ పోతున్నాడు. అసలు ఈ సినిమాలు ఎప్పటకి పూర్తవుతాయో తెలియడం లేదు. పైగా మరో యేడాదిన్నరలో ఏపీలో ఎన్నికలు ఉన్నాయి. అసలు రాజకీయాల్లోకి వెళతాడా ? ఈ లోగా ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేస్తాడా ? అన్నది ఆయనకే క్లారిటీ లేదు.
పవన్ డేట్ల కోసం క్రిష్, హరీష్‌శంకర్ – సురేందర్ రెడ్డి లాంటి డైరెక్టర్లు వెయిట్ చేస్తున్నారు. మరోవైపు కోలీవుడ్ లో సముద్రఖని డైరెక్షన్‌లో వచ్చిన వినోదయ సీతమ్ సినిమా రీమేక్‌కు కూడా ఓకే చెప్పారన్న వార్తలే పవన్ ఫ్యాన్స్‌ను తెగ కంగారు పెట్టేస్తున్నాయి. ఆ సినిమా పవన్ ఇమేజ్‌కు ఏ మాత్రం సూట్ కాదు. అసలు భీమ్లానాయక్ సినిమాకే సాగర్ కె. చంద్రకు ఛాన్స్ ఇవ్వడం చాలా మంది అభిమానులకు నచ్చలేదు.
ఇక తాజా అప్‌డేట్ ఏంటంటే సాహో లాంటి డిజాస్టర్ తర్వాత అడ్రస్ లేకుండా పోయిన సుజీత్‌కు ఇప్పుడు పవన్ ఛాన్స్ ఇవ్వబోతున్నాడన్న ప్రచారం టాలీవుడ్‌లో జోరుగా జరుగుతోంది. కేవలం రన్ రాజా రన్ సినిమా తీసిన సుజీత్‌కు సాహో ఛాన్స్ ఇవ్వడమే ప్రభాస్ చేసిన పెద్ద తప్పు. సాహో తర్వాత సుజీత్‌ను కనీసం మీడియం రేంజ్ హీరోలు కూడా దగ్గరకు రానివ్వడం లేదు. అలాంటి సుజీత్‌ను ఇప్పుడు పవన్ పిలిచి మరీ ఛాన్స్ ఇస్తున్నాడట.
పవన్ హీరోగా డీవీవీ దానయ్య నిర్మాణంలో ఈ సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఓ వైపు వినోదయ సీతమ్ సినిమాలో మేనళ్లుడు సాయితేజ్‌తో నటిస్తున్నాడని అంటున్నారు. ఈ సినిమా చేయడమే ఫ్యాన్స్‌కు నచ్చడం లేదు. తమ అభిమాన హీరో సినిమాలు అన్నీ రీమేక్‌లే అని వాళ్లకే పవన్ సినిమాపై ఆసక్తి పోతోంది. ఇప్పుడు డిజాస్టర్ డైరెక్టర్‌కు ఓకే చెప్పడం మరింత కలవర పెడుతోంది. పవన్ ఎందుకు కొరటాల శివ, సుకుమార్, త్రివిక్రమ్ లాంటి వాళ్లతో సినిమాలు చేయడకుండా వీళ్ల వెనకాల పడతాడో ? ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా సగటు అభిమానికే అర్థం కావట్లేదు.