మెగాస్టార్ చిరంజీవి నటించిన ఎన్నో సినిమాల్లో స్టేట్‌రౌడీ సినిమా ఒకటి. ముందు యావరేజ్ టాక్ అనుకున్నారు. కట్ చేస్తే సూపర్ హిట్. ఆ రోజుల్లోనే నైజాంలో కోటి రూపాయలకు పైగా షేర్ రాబట్టిన సినిమా ఇది. భానుప్రియ. హీరోయిన్. ఇక కళాబంధు టి. సుబ్బరామిరెడ్డి ఈ సినిమాకు నిర్మాత. బి. గోపాల్ దర్శకుడు. ఈ కాంబినేషన్లు చూస్తుంటేనే రిలీజ్‌కు ముందు ఇది ఎంత క్రేజీ కాంబినేషనో… సినిమాపై ఎన్ని అంచనాలు ఉన్నాయో తెలుస్తోంది.
చెన్నైలో ఈ సినిమా ఓపెనింగ్ అట్టహాసంగా జరిగింది. తెలుగుతో పాటు తమిళ సినిమా పరిశ్రమకు చెందిన అతిరథ మహారథులతో పాటు రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన సెలబ్రిటీలు హాజరయ్యారు. అయితే ఈ ప్రారంభోత్సవం కవరేజ్‌ను ఈనాడు గ్రూప్‌నకు చెందిన సితార సినీ వారపత్రికలో కేవలం ఒక్క ఫోటోతో మాత్రమే కవర్ చేశారట. ఇప్పుడు సీనియర్ జర్నలిస్టు, పీఆర్వోగా ఉన్న వినాయకరావు అప్పుడు ఈనాడులో సినీ జర్నలిస్ట్. ఎంత పెద్ద సినిమాకు అయినా ఒక్క ఫొటో పెట్టి కవరేజ్ ఇవ్వడమే అప్పుడు ఈనాడు ఆనవాయితీ.
అక్కడ ప్రారంభోత్సవం తర్వాత స్టేట్‌రౌడీ షూటింగ్ హైదరాబాద్ సారథి స్టూడియోస్‌లో జరుగుతోంది. ఈ క్రమంలోనే వినాయకరావు, ఈనాడు సినీమా ఫొటోగ్రాఫర్ కుమారస్వామితో కలిసి షూటింగ్ కవరేజ్ కోసం సారథికి వెళ్లారట. అయితే ఈ సినిమా నిర్మాణ వ్యవహారాలు చూస్తోన్న శశిభూషణ్ మేం అంత పెద్ద ఎత్తున ప్రారంభోత్సవం చేస్తే.. చిన్న ఫొటోతో తక్కువ కవరేజ్ చేస్తారా ? అని వినాయకరావుపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు చేయి చూపించి వెళ్లిపొమ్మన్నట్టుగా సైగ చేశారట.
దీంతో పక్కన ఉన్న వాళ్లు కూడా వినాయకరావును బయటకు గెంటేశారట. దీంతో అవమానంగా ఫీలైన వినాయకరావు.. ఈ విషయాన్ని రామోజీరావు దృష్టికి తీసుకువెళ్లగా ఆయన షాకింగ్ నిర్ణయం తీసుకున్నారట. నువ్వు నా మనిషివి.. నీకు అవమానం జరిగితే.. నాకు జరిగినట్టే.. ఇకపై స్టేట్‌రౌడీ షూటింగ్ కవరేజ్ ఆపేయమని.. ఆ సినిమా వార్తలేవి ఈనాడులో రాకూడదని బ్యాన్ విధించేశారట.
అక్కడితో ఆగని ఆయన తమ ఉషాకిరన్ మూవీస్‌పై తెరకెక్కే సినిమాలను కూడా సారథిలో షూట్ చేయవద్దని కండీషన్ పెట్టేశారట. అయితే ఈ విషయం నిర్మాత టి. సుబ్బారామిరెడ్డి దృష్టికి వెళ్లడంతో ఆయన స్వయంగా రామోజీరావుకు ఫోన్ చేసినా కూడా రామోజీరావు వెనక్కు తగ్గలేదట. చివరకు వినాయకరావు, మరి కొందరు సినీ పెద్దలు వీరి మధ్య ప్యాచప్ చేయడంతో అప్పుడు రామెజీ శాంతించడం.. మళ్లీ స్టేట్‌రౌడీ సినిమాకు ఈనాడు, సితారలో కవరేజ్ ఇవ్వడం మొదలయ్యాయట.