యంగ్‌టైగర్ జూనియర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో డబుల్ హ్యాట్రిక్ హిట్ల రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ తరం జనరేషన్లో స్టార్ హీరోలకు లేని అరుదైన రికార్డు తారక్ ఖాతాలో పడింది. ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో ఇప్పుడు వరుసగా క్రేజీ ప్రాజెక్టులను ఓకే చేస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో చేస్తోన్న సినిమా తర్వాత అటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా, ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సానా.. ఆ తర్వాత అనిల్ రావిపూడి ఇలా బలమైన లైనప్ ఎన్టీఆర్ దగ్గర ఉంది.
మూడున్నర సంవత్సరాలుగా పడిన కష్టం ఎట్టకేలకు త్రిబుల్ ఆర్ సినిమాతో నెరవేరింది. తాజాగా ఎన్టీఆర్ తన తాత సీనియర్ ఎన్టీఆర్‌తో పాటు తన అభిమానుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇవి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. తాను తాత ఎన్టీఆర్ నుంచే ఎంతో స్ఫూర్తి పొందానని.. తాత ఎన్టీఆర్ గొప్ప రాజకీయ నాయకుడు మాత్రమే కాదని.. గొప్ప పౌరుడు అని కూడా చెప్పాడు.
తాత తన కెరీర్లో ఎన్నో గొప్ప పాత్రలు పోషించారని.. జీవితంలో ఎంత బాధ్యతతో ఉండాలో కూడా ఆయనే చెప్పారని తారక్ గుర్తు చేసుకున్నాడు. ఆయన నుంచి స్ఫూర్తి పొందడంతో పాటు తాను కూడా సమాజానికి ఏదో ఒకటి చేయాలన్న తపనతో ఉన్నామని కూడా చెప్పాడు. తనకు ఇంత మంది అభిమానులు ఉండడం చాలా గర్వంగా ఉందని.. అయితే తన అభిమానులను తాను ఎప్పుడూ సంతోషంగా ఉంచాలనే తాను కష్టపడుతూ ఉంటానని తారక్ తెలిపాడు.
ఫ్యాన్స్‌ను ఎప్పుడూ సంతోషంగా ఉంచే విషయాలను కూడా తాను తాత గారి నుంచే తెలుసుకున్నానన్న తారక్.. మంచి కథలతో సినిమాలు చేసినప్పుడు అభిమానుల్లో ఉండే ఆనందమే వేరని పేర్కొన్నాడు. ఇక తాను చిన్నప్పుడు మొదటిసారిగా బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో నటించానని.. ఇక రాజకీయాలపై ప్రస్తుతం తనకు ఆసక్తి లేదని చెప్పడంతో పాటు సినిమాలకే పరిమితం అవుతానని కూడా చెప్పాడు.