కన్నడ స్టార్ హీరో దివంగత నటుడు పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించిన చివరి చిత్రం “జేమ్స్”. పునీత్ చనిపోయినప్పుడు కన్నడ ఇండస్ట్రీ జనాలు మాత్రమే కాదు.. ఓవరాల్గా కన్నడ జనాలు అందరూ తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యారు. తమ ఇంట్లో కుటుంబ సభ్యుడు చనిపోతే ఎలా ? ఫీలవుతారో ? అలాగే బాధపడ్డారు. పునీత్ నిజంగా సినిమా స్టార్ కంటే కూడా సమాజ సేవ, మంచితనం ద్వారానే ప్రేక్షకుల మదిలోకి చొచ్చుకుపోయాడు.
అందుకే పునీత్ చనిపోతే కన్నడ సినిమా వాళ్లతో పాటు ఇటు తెలుగు, అటు కోలీవుడ్.. చివరకు బాలీవుడ్ వాళ్లు సైతం బాధపడ్డారు. అలాగే కన్నడ సీమ బయట సాధారణ ప్రజల దుఃఖానికి కూడా అంతే లేకుండా పోయింది. అందుకే పునీత్ నటించిన చివరి సినిమాను ఆయన జయంతి కానుకగా ఈ నెల 17న రిలీజ్ చేశారు. ఈ సినిమా కోసం కన్నడ ప్రజలు వెయిట్ చేసిన తీరు.. పెద్ద పండగలా సెలబ్రేట్ చేసుకోవడం.. నిజంగా పునీత్ లేకపోయినా ఆయన చరిత్రలో మంచి జ్ఞాపకంగా మిగిలిపోయింది.
వారం రోజుల పాటు కర్నాటకలో అన్ని థియేటర్లలో జేమ్స్ సినిమాను మాత్రమే ప్రదర్శించాలని కూడా డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయం తీసుకున్నారు. ఇక బెంగళూరు సిటీతో పాటు కన్నడ సీమ ఈ సినిమా ఆడుతోన్న థియేటర్ల దగ్గర రక్తదానాలు, నేత్ర శిబిరాలు, అన్నదానాలతో హోరెత్తిపోయింది. ఫస్ట్ డే కన్నడంలోనే రు. 26 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ సినిమా కేవలం 4 రోజుల్లో రు. 100 కోట్ల వసూళ్లు సాధించి పవర్ ఫుల్ బ్లాక్ బస్టర్.. ఆల్ టైం ఇండస్ట్రీ హిట్గా నిలిచింది.
88 సంవత్సరాల కన్నడ సీమ చరిత్రలో నాలుగు రోజుల్లో 100 కోట్లు సాధించిన తొలి సినిమాగా జేమ్స్ అరుదైన రికార్డు క్రియేట్ చేసింది. పునీత్ ఈ రోజు మన మధ్యలో లేకపోయినా.. అతడంటే ఆయన అభిమానులతో పాటు కన్నడ జనాలు ఎంతలా ఆదరాభిమానాలు కురిపిస్తారో ? ఈ వసూళ్లే చెపుతున్నాయి. ఈ రు. 100 కోట్ల గ్రాస్ వసూళ్లు కావడం విశేషం.
ఇక ప్రియా ఆనంద్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో మెయిన్ విలన్గా శరత్ కుమార్ నటించగా.. మన తెలుగు సీనియర్ హీరో శ్రీకాంత్ కూడా మరో పాత్రలో నటించారు. చరణ్ రాజ్ సంగీతం అందించగా.. చేతన్ కుమార్ దర్శకత్వం వహించారు.