యంగ్ రెబల్ స్టార్ – పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ మరి కొద్ది గంటల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ప్రభాస్ అంటే బాహుబలి సినిమాకు ముందు… బాహుబలి సినిమాకు తర్వాత అన్నట్టుగా ప్రభాస్ క్రేజ్ పెరిగిపోయింది. బాహుబలి ది బిగినింగ్ – బాహుబలి ది కంక్లూజన్ సినిమాలతో ఒక్కసారిగా నేషనల్ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు ప్రభాస్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ప్రభాస్ సినిమాలతో బాలీవుడ్ స్టార్ హీరోలకు సైతం చెమటలు పడుతున్నాయి.
బాహుబలి సినిమా విషయంలో చాలామంది ప్రభాస్ తో పాటు… ఇంకా చెప్పాలంటే ప్రభాస్ కంటే ఎక్కువగా రాజమౌళికే క్రెడిట్ ఇచ్చారు. అయితే సాహో సినిమాకు ప్లాప్ టాక్ వచ్చినా కూడా బాలీవుడ్ లో ఏకంగా రు. 150 కోట్లకు పైగా వసూళ్లు రావడంతో దేశం మొత్తం షాక్ అయింది. కేవలం ఒక్క సినిమాకు మాత్రమే దర్శకత్వం వహించిన సుజిత్ లాంటి దర్శకుడితో ప్రభాస్ సాహో సినిమా చేసి పెద్ద రిస్క్ చేశాడు. అయినా సాహో ఫ్లాప్ టాక్‌తో కూడా కోట్లాది రూపాయలు వసూళ్లు కొల్లగొట్టింది. ఒక్క బాలీవుడ్ లోనే రు. 150 కోట్లు ఎలా వచ్చాయో అర్థం కాక ట్రేడ్ వర్గాలు తలలు పట్టుకున్నాయి.
సాహో తర్వాత మళ్లీ మూడు సంవత్సరాల గ్యాప్ తో ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ థియేటర్లలోకి వస్తోంది. విచిత్రం ఏంటంటే కేవలం రన్ రాజా రన్ సినిమా మాత్రమే డైరెక్ట్ చేసిన సుజిత్‌తో సాహో లాంటి భారీ బడ్జెట్ సినిమా చేసిన ప్రభాస్ ఇప్పుడు కూడా అంతే పెద్ద సాహసం చేశాడు. గోపిచంద్ హీరోగా ఎప్పుడో ఆరు సంవత్సరాల క్రితం జిల్ సినిమాను తెరకెక్కించిన రాధాకృష్ణ కుమార్‌కు రెండో సినిమాతోనే ఇంత పెద్ద సినిమాను డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చాడు. ముందుగా రు. 150 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించాలని అనుకున్నారు. కరోనా ప్రభావంతో వడ్డీలు విపరీతంగా పెరిగి మొత్తం బడ్జెట్ రు. 300 కోట్లకు చేరుకుంది.
ఈరోజు సాయంత్రం నుంచే ఓవర్సీస్‌లో రాధే శ్యామ్ ప్రీమియర్లు స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పటికే అక్కడ హాఫ్ మిలియన్ డాలర్ల మార్కును క్రాస్ చేసిన ఈ సినిమా ఫస్ట్ డే ముగిసేనాటికి మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా మన దేశంలో బ్రేక్ అవ్వాలంటే విడుదలైన అన్ని భాషల నుంచి కనీసం రు. 200 కోట్ల షేర్ రాబట్టాలని తెలుస్తోంది.
కేవలం మన దేశంలోని అన్ని భాషల్లో రాధేశ్యామ్‌కు రు. 200 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. రు. 200 కోట్ల షేర్ అంటే కనీసం రు. 300 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది. బాహుబలి, సాహో మానియాతో ఉన్న ప్రభాస్ కు ఈ వసూళ్లు రావడం పెద్ద కష్టం కాదు. సినిమాకు ఏ మాత్రం హిట్ టాక్ వచ్చినా అదిరిపోయే ఓపెనింగ్స్ వస్తాయని కూడా బాలీవుడ్ ట్రేడ్ సైతం అంచనా వేస్తోంది. మరి ప్రభాస్ ఏం చేస్తారో మరి కొద్ది గంటల్లో తేలిపోనుంది.