టాలీవుడ్ లో రెండు దశాబ్దాల క్రితం మెగాస్టార్ చిరంజీవి – యువరత్న నందమూరి బాలకృష్ణ మధ్య తీవ్రమైన పోటీ ఉండేది. ఈ ఇద్దరు స్టార్ హీరోల అభిమానులు తమ హీరో సినిమా సూపర్ హిట్ అవ్వాలని పంతాలు, పట్టింపులతో ఉండేవారు. ఈ ఇద్దరు హీరోలు నటించిన సినిమాలు ఒకే టైమ్‌లో రిలీజ్ అయితే బాక్సాఫీస్ దగ్గర వార్ హీటెక్కిపోయి ఉండేది. ఈ ఇద్దరు హీరోలు చాలాసార్లు బాక్సాఫీస్ దగ్గర తమ సినిమాలతో పోటీ పడ్డారు. ఒక్కోసారి ఒక్కో హీరో సినిమా పైచేయి సాధించేది. 1999 – 2001 సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ ఇద్దరు హీరోల సినిమాల్లో రెండుసార్లు కూడా బాలయ్య పైచేయి సాధించాడు. 1999 సంక్రాంతి కానుకగా బాలయ్య నటించిన సమరసింహా రెడ్డి – చిరంజీవి నటించిన స్నేహంకోసం సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమాలలో సమరసింహారెడ్డి ఇండస్ట్రీ హిట్ అయ్యింది. ఆరోజుల్లోనే సమరసింహారెడ్డి 77 కేంద్రాలలో 100 రోజులు ఆడింది.
ఇక 2001 సంక్రాంతి కానుకగా వచ్చిన నరసింహనాయుడు – మృగరాజు సినిమాలలో నరసింహనాయుడు సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. మృగరాజు చిరంజీవి కెరీర్ లోనే మర్చిపోలేని డిజాస్టర్ గా మిగిలిపోయింది. భారతదేశ సినీ చరిత్రలో తొలిసారిగా వంద కేంద్రాల్లో 100 రోజులు ఆడిన సినిమాగా నరసింహనాయుడు రికార్డులకు ఎక్కింది. విచిత్రమేంటంటే సమరసింహారెడ్డి – నరసింహనాయుడు రెండు సినిమాలకు బి.గోపాల్ డైరెక్టర్. 2001 సంక్రాంతికి నరసింహనాయుడు – మృగరాజు ఒకేసారి రిలీజ్ కావడంతో బాక్సాఫీస్ దగ్గర ఈ రెండు సినిమాలు మధ్య భీకర యుద్ధం జరిగింది. నాడు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ చూసినా బాలయ్య – చిరంజీవి అభిమానుల మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. భారీ అంచనాలు ఉన్న మృగరాజు సినిమా ఎక్కడికక్కడ భారీ రేట్లకు కొనుగోలు చేశారు. అంతకుముందు చిరంజీవి – గుణశేఖర్ కాంబినేషన్ లో వచ్చిన చూడాలని ఉంది సూపర్ హిట్ అవ్వడంతో మృగరాజు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ రేటుకు అమ్ముడు పోయింది.
ఇక వరుస ఫ్లాపులతో ఉన్న బాలయ్యకు అప్పుడు మార్కెట్ డల్ గా ఉంది. నరసింహనాయుడు సినిమా తక్కువ రేటుకు కొనుగోలు చేశారు. నాటి సమైక్య రాష్ట్రంలో చిరంజీవి సినిమా వస్తుంది అంటే ప్రత్యేకంగా కొన్ని థియేటర్లలో ఎక్కువగా రిలీజ్ చేసే వారు. ఏ సెంటర్లో అయినా చిరంజీవి కోసమే ఏళ్లకు ఏళ్లుగా కొన్ని థియేటర్లు స్పెషల్‌గా ఉండేవి. అయితే మృగరాజుపై ఉన్న భారీ అంచనాల నేపథ్యంలో రెగ్యులర్‌గా చిరంజీవి సినిమాకు ఇచ్చే థియేటర్లు కాకుండా… మరికొంత మంది ఎక్కువ రేట్లు పెట్టి కొనుగోలు చేశారు. అలా మృగరాజు కొత్త థియేటర్లలోకి వెళ్ళిపోయింది.
ఇక చిరంజీవి ప్రతి సినిమా రిలీజ్ థియేటర్ లలో కొన్ని చోట్ల నరసింహనాయుడు సినిమా రిలీజ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం సౌభాగ్య థియేటర్ అంటే చిరంజీవి సినిమాలకు పెట్టింది పేరు. చిరంజీవి కెరీర్లో ఎన్నో సినిమాలు ఈ థియేటర్లో రిలీజ్ అయ్యి 100 రోజులు ఆడితే.. మరికొన్ని సినిమాలు 50 రోజులకు పైగానే ఆడాయి. చివరకు బిలో యావరేజ్ సినిమా ఇద్దరు మిత్రులు సినిమా కూడా ఈ థియేటలో వందరోజులు ఆడింది అంటే చిరంజీవి సినిమాలకు సౌభాగ్య థియేటర్ కు ఉన్న సెంటిమెంట్ ఎలాంటిదో అర్థం అవుతుంది.
2001 సంక్రాంతి కి రిలీజ్ అయిన మృగరాజు సినిమా సౌభాగ్య థియేటర్ లో కాకుండా లక్ష్మీ నారాయణ థియేటర్ లో రిలీజ్ అయింది. నరసింహనాయుడు సినిమా సౌభాగ్యలో రిలీజ్ చేశారు. సౌభాగ్య థియేటర్ ప్రముఖ రాజకీయ నాయకుడు, పశ్చిమగోదావరి జిల్లా మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు థియేటర్. మృగరాజు డిజాస్టర్ కావడంతో నరసింహనాయుడు సూపర్ హిట్ అయ్యింది. సౌభాగ్య లో ఈ సినిమా 125 రోజుల పాటు ఆడింది. చిరంజీవికి సెంటిమెంట్ అయిన థియేటర్లో నరసింహనాయుడు రికార్డు స్థాయిలో ఆడడంతో పాటు సెంచరీ కొట్టింది. ఈ సినిమాకు ఆ ఒక్క థియేటర్లోనే రు. 20 లక్షలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అప్పట్లో ఇది జిల్లా సినిమా వర్గాల్లో హైలెట్ గా నిలిచింది.