టాలీవుడ్ తెరపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరు తెచ్చుకున్నారు సుధ. మూడు దశాబ్దాలకు పైగా అక్క, వదిన, అమ్మ, అత్త పాత్రలతో మెప్పిస్తూ వస్తున్నారు. ఈ పాత్రలే ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. అసలు సుధ కెరీర్ తొలినాళ్లలో ఆమెను చూసిన వారు ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు నీకు ఎందుకు ? హీరోయిన్గా ట్రై చేయవచ్చు కదా ? అనే వారట. ఆ మాట అంది దర్శక, నిర్మాతలు మాత్రమే కాదు స్టార్ హీరోలు కూడా అట. ఈ విషయాన్ని సుధ తన తాజా ఇంటర్వ్యూలో చెప్పింది.
కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో నాగార్జున – మీనా హీరో, హీరోయిన్లుగా ప్రెసిడెంట్ గారి పెళ్లాం షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాకు దొరస్వామి రాజు నిర్మాత. దర్శకుడు కోదండ రామిరెడ్డి కాల్ చేసి సుధ చేయాల్సిన పాత్ర గురించి చెప్పారట. వెంటనే ఆమె ఓకే చెప్పేసి హైదరాబాద్కు వచ్చారట. అప్పుడు భాస్కర్ ప్యాలెస్లో నాగార్జున – మీనాపై ఓ పాటను షూట్ చేస్తున్నారట.
కోదండ రామిరెడ్డిని కలవాలని సుధ వైట్ చూడీదార్ వేసుకుని అక్కడకు వెళ్లిందట. నాగార్జునతో ఫస్ట్ టైం వర్క్ చేస్తుండడంతో ఆయనతో కూడా మాట్లాడాలని సుధ రెడీగా ఉన్నారట. వెంటనే నాగార్జున సుధను పైకి కిందకు చూసి.. ఈవిడ వదిన క్యారెక్టరా ? కరెక్టుగా చూసే పెట్టారా ? అని అనడంతో కోదండ రామిరెడ్డితో పాటు అందరూ షాక్ అయ్యారట.
ఆ మరుసటి రోజు సుధ తన పాత్రకు తగినట్టుగా కాటన్ శారీ వేసుకుని.. కొప్పు పెట్టుకుని వెళ్లడంతో ఈ సారి కూడా నాగార్జున సుధను చూసి.. నిన్న వచ్చింది నువ్వే కదా అంటూ ఆశ్చర్యపోయారట. ఇక గ్రీకువీరుడు సినిమా షూటింగ్లో కూడా నాగ్ నువ్వు కెమేరా ముందు ఒకలా ఉంటావు.. కెమేరా వెనక మరోలా ఉంటావు అని కితాబు ఇచ్చారట. ఇక చాలా మంది కెరీర్ స్టార్టింగ్లో హీరోయిన్గా ట్రై చేయమని సూచించారని సుధ చెప్పింది. బాలచందర్ గారి ప్రోత్సాహంతోనే తనను తాను ఇలా మార్చుకుని ఎక్కువ రోజులు కెరీర్ కంటిన్యూ చేస్తున్నానని చెప్పింది.