ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా స్వయం కృషితో స్టార్ హీరోగా ఎదిగిన టాలీవుడ్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవిది ప్రత్యేక స్థానమని చెప్పొచ్చు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు జన్మించిన చిరంజీవికి చిన్నతనం నుంచే నటన మీద ఆసక్తి ఏర్పడింది. ఆ ఆసక్తితోనే చదువు పూర్తైన తర్వాత చెన్నైలోని మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ లో నటన శిక్షణ పొందారు.
ఆపై అవకాశాల కోసం వేట మొదలు పెట్టిన చిరంజీవి.. `పునాది రాళ్లు` సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. గూడపాటి రాజ్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ధర్మవిజయ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.ఫజలుల్లా హక్ నిర్మించారు. చిరంజీవి నటించిన మొదటి సినిమా పునాదిరాళ్లు అయినప్పటికీ `ప్రాణం ఖరీదు` సినిమా ముందు రిలీజ్ అయ్యింది.
అయితే ఈ రెండు చిత్రాలకు చిరంజీవి పారితోషికం తీసుకోలేదు . ఆ తర్వాత ఈయన నటించిన చిత్రం `మన ఊరి పాండవులు`. బాపు దర్శకత్వం వహించిన ఈ సినిమాను జయకృష్ణ నిర్మించారు. ఈ సినిమాకు గానూ చిరంజీవి కేవలం రూ.1116 రెమ్యునరేషన్‌గా తీసుకున్నారు. అదే ఆయన ఫస్ట్ రెమ్యునరేషన్. ఇక ఆ తర్వాత అంచలంచలుగా ఎదిగిన చిరంజీవి.. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 25 కోట్లకు వరకు పారితోషకంగా పుచ్చుకుంటున్నారు.
కాగా, చిరంజీవి సినిమాల విషయానికి వస్తే.. కొరటాల శివ దర్శకత్వంలో ఈయన నటించిన `ఆచార్య` చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే చిరు మరోవైపు మోహన్ రాజా డైరెక్షన్‌లో `గాడ్ ఫాదర్`, మెహర్ రమేష్ డైరెక్షన్‌లో `భోళా శంకర్` మరియు బాబి డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం వీటిల్లో గాడ్ ఫాదర్, భోళా శంకర్ చిత్రాలు సెట్స్ మీదే ఉన్నాయి.