టాలీవుడ్ మన్మధుడు నాగార్జున – రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో 2016 సంక్రాంతి కానుక రిలీజైన సోగ్గాడే చిన్నినాయన సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సినిమాతోనే కళ్యాణ్ కృష్ణ దర్శకుడిగా పరిచయం అయ్యారు. నాలుగు పెద్ద సినిమాల మధ్య పోటీగా రిలీజ్ అయిన సోగ్గాడే చాలా రోజుల తర్వాత నాగార్జునకు మంచి విజయాన్ని అందించింది. నాగార్జున కెరీర్లో తొలి రు. 50 కోట్ల సినిమాగా నిలిచిపోయింది. ఇక ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే.
ఈ సినిమాలో నాగార్జున – రమ్యకృష్ణతో పాటు నాగార్జున కుమారుడు నాగ చైతన్య – కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న బంగార్రాజు సంక్రాంతికి థియేటర్లలోకి రానుంది. సంక్రాంతికి వస్తున్న పెద్ద సినిమాలు వాయిదా పడడంతో ఇప్పుడు బంగార్రాజును థియేటర్లలోకి తేవాలని నిర్మాత నాగార్జున డిసైడ్ అయిపోయారు.
సోగ్గాడే లాంటి సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న బంగార్రాజు ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగినట్లు తెలుస్తోంది. ఆంధ్ర ఏరియాలో ఈ సినిమాను రు. 12 కోట్లకు, సీడెడ్ ఏరియాలో ఐదు కోట్లకు అమ్మినట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగార్రాజు ఫ్రీ రిలీజ్ బిజినెస్ రు. 25 కోట్ల వరకూ జరిగిందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. తెలంగాణలో ఈ సినిమాకు వచ్చిన ఇబ్బంది లేదు.
కేసీఆర్ ప్రభుత్వం పెద్ద సినిమాలకు టిక్కెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు ఇచ్చింది. మరోవైపు సంక్రాంతి నేపథ్యంలో వారం రోజుల పాటు రోజుకు ఐదు షోలు వేసుకునేందుకు అక్కడ అనుమతి ఉంది.
అయితే కరోనా కేసుల నేపథ్యంలో మళ్లీ థియేటర్లను మూసేస్తారా ? లేదా సెట్టింగ్ కెపాసిటీ తగ్గిస్తారా ? అన్న సందేహాలు మాత్రం ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే టాలీవుడ్‌కు ఏపీ ప్రభుత్వానికి మధ్య చర్చలు నడుస్తున్నాయి.
అక్కడ ఇప్పుడున్న టికెట్ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బంగార్రాజు అక్కడ ఏమేరకు వసూళ్లు రాబడుతోంది అన్న సందేహాలు కూడా ఉన్నాయి. సంక్రాంతికి వస్తున్న ఏకైక పెద్ద సినిమాగా బంగార్రాజుకు అడ్వాంటేజ్ ఉన్నా… కరోనా నేపథ్యంలో మళ్లీ లాక్డౌన్ విధిస్తారు అన్న భయం కూడా ట్రేడ్ వర్గాల్లో ఉంది. ఏదేమైనా బంగార్రాజు ఈ టార్గెట్‌ను ఎలా ? చేధిస్తాడు అన్నది మాత్రం కాస్త టెన్షన్ గానే ఉంది.