తెలుగు సినిమా రంగంలో నెంబర్ వన్ స్థానం కోసం హీరోలు పడీపడడం అనేది ఐదు దశాబ్దాల క్రిందట నుంచే ఉంది. అప్పట్లో ఎన్టీఆర్ – ఏఎన్నార్ మధ్య పోటీ ఉండేది. తర్వాత ఎన్టీఆర్ టాప్ ప్లేసులో ఉన్నప్పుడు సూపర్‌స్టార్ కృష్ణ ఆయనకు పోటీగా సవాల్ చేసి మరీ సినిమాలు చేసేవారు. ఇంకా చెప్పాలంటే ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయిన రోజునే తన సినిమాలు కూడా రిలీజ్ చేసేవారు. ఇక కృష్ణ ఎన్టీఆర్‌తో కేవలం సినిమాల విషయంలోనే కాకుండా.. రాజకీయాల్లోనూ పోటీ పడేవారు.
ఎన్టీఆర్ ఒక హిట్ సినిమా తీస్తే .. ఆయన కూడా వెంటనే మరో హిట్ సినిమా చేసేవారు. ఎన్టీఆర్ పౌరాణిక పాత్రలతో సినిమాలు చేస్తే.. కృష్ణ కూడా అదే పాత్రల్లో నటించేవారు. ఇక ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రజల్లోకి వెళ్లినప్పుడు కృష్ణ పోటీగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. ఎన్టీఆర్ ముందు నుంచి రాజకీయాలపై ఓ కన్నేసి ఉంచేవారు. కృష్ణ అటు వైపు చూసేవారే కాదు.
కృష్ణ సినిమాలు చేసుకుంటూ తన పనేదో తాను చేసుకునేవారు. కృష్ణ నటించిన ఈనాడు సినిమా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉండడంతో అది అప్పట్లో ఎన్టీఆర్ తెలుగుదేశంకు సాయపడిందని అంటారు. ఆ తర్వాత మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ పిలుపు మేరకు కృష్ణ రాజకీయాల్లోకి రావడంతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత కృష్ణ నటించిన కొన్ని సినిమాలు ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా తీశారన్న ఊహాగానాలు అప్పట్లో ఎక్కువుగా వినిపించేవి.
అందులో సింహాసనం – మండలాధీశుడు ( గెస్ట్ రోల్ ) – నా పిలుపు ప్రభంజనం – గండిపేట రహస్యం – సాహసమే నా ఊపిరి సినిమాల విషయంలో అవి ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా ఉన్నాయన్న చర్చ అయితే నడిచింది. ఈ సినిమాల్లో కొన్నింటికి విజయనిర్మల దర్శకత్వం వహించారు. ఈ సినిమాలలో కొన్నింటిలో కృష్ణ స్వయంగా నటిస్తే.. మరి కొన్నింటిలో వేరే హీరోలను, నటులను నటింపజేశారు. వీటిల్లో ఎన్టీఆర్ తరచూ వాడే ఊతపదాలను వాడారు. అయితే ఈ సినిమాలపై అప్పట్లో టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.