యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. విచిత్రమేంటంటే క్రిటిక్స్ నుంచి కూడా నెగిటివ్ రివ్యూలు తెచ్చుకున్న ఈ సినిమా వాటితో సంబంధం లేకుండా బాక్సాఫీస్ దగ్గర మాస్ జాతరను తలపిస్తోంది. బాలయ్య – బోయపాటి కాంబినేషన్లో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు ఎంత హిట్ అయ్యాయో ? వాటికి ఏ మాత్రం తగ్గకుండా దూసుకుపోతోంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత రిలీజ్ అయిన పెద్ద సినిమా కావడంతో అఖండ పై ముందు నుంచే ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ అంచనాలను సినిమా నూటికి నూరు శాతం అందుకుంది. విచిత్రమేంటంటే కేవలం మూడు రోజులకే చాలా ఏరియాల్లో అఖండ బ్రేక్ ఈవెన్‌కు వచ్చేసింది. బాలయ్యకు డల్ మార్కెట్ ఉందన్న అభిప్రాయం ఉన్నా ఓవర్సీస్ తోపాటు నైజాంలో అఖండ మూడో రోజుకే బ్రేక్ ఈవెన్‌కు రావటం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. ఓవర్సీస్లో అఖండ వన్ మిలియన్ మార్క్ కు దగ్గరలో ఉంది. ఇక నైజాంలో తొలి రోజు 4.4 కోట్లు కొల్లగొట్టిన అఖండ రెండో రోజు రు 2.2 కోట్లు – మూడు రోజు 2.5 కోట్ల షేర్ తో ఓవరాల్‌గా ఇప్పటివరకు 9.1 కోట్ల షేర్ సాధించింది.
ఇక ఐదో రోజు నుంచి ఈ సినిమాకు వచ్చే వసూళ్లు అన్ని కూడా లాభాలే కావడం విశేషం. ఓ వైపు అమెరికాలో ఒమ్రికాన్ అనే కొత్త వేరియంట్ అందరిని భయపెడుతుంటే మరోవైపు అఖండ గర్జన మాత్రం ఆగడం లేదు. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో చచ్చిపడిన తెలుగు సినిమాకు అఖండ జ్యోతిలా ఈ సినిమా కనిపిస్తోంది. ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతూ ఉండడంతో పెద్ద హీరోలు ధైర్యంగా తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.
ఇక కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర బాక్సాఫీస్ వద్ద కూడా అఖండ గర్జన మామూలుగా లేదు. మరి అఖండ లాంగ్ రన్లో ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో ? చూడాలి.