యావత్ తెలుగు సినిమా పరిశ్రమ చూపు అంతా ఇప్పుడు అఖండ సినిమాపైనే ఉంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లు తెరచుకుని రెండు నెలలు దాటుతోంది. అయితే ఇప్పటి వరకు థియేటర్లలో చెప్పుకోదగ్గ పెద్ద సినిమా ఏదీ రాలేదు. అక్కినేని సోదరుల లవ్‌స్టోరీ, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాలు మాత్రమే వచ్చాయి. ఓ మోస్తరు టాక్ తెచ్చుకున్న ఈ సినిమాలు బ్రేక్ ఈవెన్ అయ్యాయి. అయితే తెలంగాణ వరకు లాభాల్లో ఉన్న ఈ రెండు సినిమాలు ఏపీలో మాత్రం బ్రేక్ ఈవెన్‌కు దగ్గర్లోనే ఆగిపోయాయని అంటున్నారు.
ఏపీలో టిక్కెట్ రేట్లు చాలా వరకు తగ్గించేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే ఇప్పుడు ఇండస్ట్రీకి పెను శాపంగా మారింది. ఎంత గొప్ప సినిమాకు అయినా ఇక్కడ వసూళ్లు రావడం లేదు. ఇక తాజాగా ఈ రోజు ఏపీ ప్రభుత్వం ఏ నగరాల్లో, ఏ థియేటర్లలో టిక్కెట్ రేట్లు ఎంత ఉండాలో జీవో రిలీజ్ చేసింది. ఈ టిక్కెట్ రేట్లలో హయ్యస్ట్ 240 మాత్రమే.
ఇక 20 ఏళ్ల క్రిందట ఉన్న రేట్లే ఇప్పుడు అమలు చేయాలని ప్రభుత్వం కఠినమైన నిర్ణయం తీసుకుంది. దీనికి తోడు బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు క్యాన్సిల్ చేసింది. రోజుకు 4 ఆటలు మించి వేయకూడదని కూడా నిర్ణయం తీసుకుంది. ఇలాంటి నేపథ్యంలో పెద్ద సినిమా అఖండ థియేటర్లలోకి వస్తోంది. ఒక వేళ ఈ సినిమాకు టాక్ బాగా వచ్చినా కూడా ఏపీలో అనుకున్న స్థాయిలో వసూళ్లు రాకపోతే మాత్రం చాలా పెద్ద సినిమాలు కూడా ఓటీటీ బాట పట్టేస్తాయి.
ఇప్పటికే భారీ బడ్జెట్ సినిమాలకు కూడా ఓటీటీ ఆఫర్లు ఊరిస్తున్నాయి. ఇప్పటికే ట్రిఫుల్ ఆర్ మూవీకి సైతం ఓటీటీ నుంచి భారీ ఆఫర్ వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా అసలు అఖండ రిజల్డ్ ఎలా ఉండబోతోంది ? ఈ సినిమా భవితవ్యం ఏంటనే దానిపైనే ఇప్పుడు టాలీవుడ్ అంతా ఆసక్తితో ఎదురు చూస్తోంది.