తెలుగు చలన చిత్ర పరిశ్రమ మొత్తం శోక శంద్రంలో మునిగిపోయింది. సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా న్యూమోనియాతో బాధపడుతున్న సిరివెన్నెల.. సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతిపై కిమ్స్ వైద్యులు ప్రకటన చేశారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఊపిరితిత్తుల క్యాన్సర్ సంబంధిత సమస్యలతో మంగళవారం సాయంత్రం 4.07 గంటలకు తుదిశ్వాస విడిచారని తెలిపారు.
ఈ విషాద వార్తతో సినీ లోకం మూగబోయింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి పట్ల పలువురు ప్రముఖు దిగ్భాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అంటూ సోషల్ మీడియా వేదికగా సంతాప తెలియ జేస్తున్నారు. మహానుభావా.. వీడుకోలు.. మరొకరు లేరు.. రాబోరు.. ఇక మీరు లేరనే వార్త జీర్ణించు కోలేకపోతున్నాం అంటూ వెన్నెల కిషోర్ తన సంతాపం తెలిపారు. ”అక్షరానికి అన్యాయం చేసి, సాహిత్యాన్ని ఒంటరి చేసి అందనంత దూరం వెళ్లిపోయిన మహాకవి, మహా మనిషి గురువు గారు సీతారామ శాస్త్రి గారికి కన్నీటి వీడ్కోలు” అంటూ కోన వెంకట్ ట్వీట్ చేశారు.
20 మే, 1955న ఆంధ్ర ప్రదేశ్ లోని అనకాపల్లిలో జన్మించిన ఈయన .. కలం నుంచి ఎన్నో వేల పాటలు జాలువారాయి. 1984లో బాలకృష్ణ హీరోగా వచ్చిన జననీ జన్మభూమి సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఈయన ..అందులో చంబోలు సీతారామశాస్త్రిగా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. కానీ సీతారామశాస్త్రికి గుర్తింపు తీసుకొచ్చిన ఫస్ట్ సినిమా మాత్రం సిరివెన్నెల. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో ఆయన మోస్ట్ వాంటెడ్ రైటర్ అయిపోయారు. అదే సినిమా ఇంటిపేరుగా మారిపోయింది.