తెలుగు సినిమా రంగంలో నందమూరి వంశం నుంచి ఎన్టీఆర్ తర్వాత రెండో తరంలో ఆయన ఇద్దరు కుమారులు బాలకృష్ణ, హరికృష్ణ నటించి సక్సెస్ అయ్యారు. ఇక మూడో తరంలో ఆయన మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్ హీరోలుగా కొనసాగుతున్నారు. వీరిద్దరి కాకుండా నందమూరి తారకరత్న సైతం హీరోగా వచ్చి కొన్ని సినిమాలు చేశారు. ఆ తర్వాత హీరోగా సక్సెస్ కాకపోవడంతో విలన్‌గా మారారు. కొన్ని సినిమాల్లో విలన్ వేషాలు వేసి అప్పుడప్పుడు తను కూడా సినిమాల్లో ఉన్నానని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తారకరత్న తెలుగు సినిమా చరిత్రలో గొప్ప గొప్ప హీరోలు, స్టార్ హీరోలకే సాధ్యంకాని ఓ రికార్డు సాధించారు.
ఒక్కసారి వెనక్కు వెళితే కెరీర్ ఆరంభంలో నందమూరి వంశం నుంచి ఎలాంటి సపోర్ట్ లేకుండా స్టార్ హీరో అయ్యాడు జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ వన్ – ఆది లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలతో నందమూరి ఫ్యామిలీ అభిమానులను చాలా వరకు తన వైపునకు తీసుకున్నాడు. అయితే అదే సమయంలో నందమూరి ఫ్యామిలీ వారసత్వాన్ని తాము కూడా కొనసాగించాలని ఫ్యామిలీలో కొందరు డెసిషన్ తీసుకున్నారు. ఈ క్రమంలోనే నందమూరి తారకరత్నను హీరోగా తెరమీదకు తీసుకువచ్చారు.
అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు తారకరత్న హీరోగా ఒకే సారి… ఒకే రోజు ఏకంగా తొమ్మిది సినిమాలకు ప్రారంభోత్సవం చేశారు. ఒకే రోజు తొమ్మిది సినిమాలకు ప్రారంభోత్సవం జరుపుకున్న డెబ్యూ హీరోగా అరుదైన రికార్డు తారకరత్న సొంతం అయ్యింది. పైగా రాష్ట్ర ముఖ్యమంత్రి వీటిని ప్రారంభించడం కూడా అప్పట్లో సంచలనం అయ్యింది. తారకరత్న ఫస్ట్ సినిమా ఒకటో నెంబర్ కుర్రాడు యావరేజ్ గా నిలిచింది. రెండో సినిమా యువరత్న డిజాస్టర్ అయింది మూడో సినిమా మా తారక్ ప్లాప్ అయింది. అప్పటి నుంచి తారకరత్న హీరోగా ప్రారంభమైన తొమ్మిది సినిమాలు కూడా పూర్తి చేయలేని పరిస్థితి.
ఆ తర్వాత అమరావతితో పాటు ఒకటి… రెండు సినిమాల్లో విలన్ గా చేసినా అనుకున్న స్థాయిలో గుర్తింపు రాక తారకరత్న కెరీర్ ఆగిపోయింది. అయితే ఆ రికార్డు మాత్రం తారకరత్న పేరిటే నిలిచిపోయింది.