టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చిన్నవయసులోనే వరుసగా స్టూడెంట్ నెంబర్ వన్ – ఆది – సింహాద్రి లాంటి బ్లాక్బస్టర్ సినిమాలతో తిరుగులేని స్టార్ డమ్ తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే 2005 లో స్టార్ డైరెక్టర్ బి.గోపాల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నరసింహుడు సినిమా తెరకెక్కింది. అప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అల్లరి రాముడు సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. దీనికితోడు సమరసింహా రెడ్డి లాంటి ఇండస్ట్రీ హిట్ నిర్మించిన అప్పటి తెలుగుదేశం ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు నరసింహుడు సినిమా నిర్మించారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
గ్లామర్ హీరోయిన్లు అమీషా పటేల్, సమీరా రెడ్డి ఈ సినిమాలో ఎన్టీఆర్ పక్కన నటించారు. అయితే సినిమాకు తొలి రోజే డిజాస్టర్ టాక్ వచ్చింది. ఎన్టీఆర్‌కు అప్పటికే ఆది – సింహాద్రి లాంటి మాస్ బ్లాక్ బస్టర్ హిట్లు పడ్డాయి. దీంతో మరోసారి అదే మాస్ మూస కథతో ఈ సినిమా తీశారు. నరసింహుడు సినిమాకు తొలి రోజే డిజాస్టర్ టాక్ వచ్చింది. మే 20న ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా.. ఫైనాన్ష్ ప్రాబ్లమ్స్‌తో చాలా ఏరియాలకు తొలి రోజు బాక్సులు వెళ్లలేదు.
ఇక చాలా సెంటర్లకు రెండో రోజు సాయంత్రానికి ప్రింట్లు పంపించారు. అయితే అప్పటికే ముందు రోజు రిలీజ్ అయిన సెంటర్ల నుంచి ప్లాప్ టాక్ బాగా స్ప్రెడ్ అయిపోయింది. దీనికితోడు రొటీన్ కథ కావడంతో పాటు.. కథనంలో దమ్ము లేకపోవడం. బి. గోపాల్ దర్శకత్వ వైఫల్యం ఈ సినిమాను ప్లాప్ చేశాయి. ఈ సినిమా వచ్చాక ఎన్టీఆర్ హిట్ ఇవ్వడానికి చాలా టైం పట్టింది. ఇక ఈ సినిమా ప్లాప్ కావడంతోనే నిర్మాత చెంగల వెంకట్రావు రిలీజ్ రోజునే హైదరాబాద్‌లో హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే అక్కడే ఉన్న పోలీసులు ఆయన్ను కాపాడారు.