టాలీవుడ్ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు తెలంగాణ గవర్నమెంట్ భారీ షాకిచ్చింది. బన్నీకు తెలంగాణ ఆర్టీసీ లీగల్ నోటీసులు ఇచ్చింది. అల్లు అర్జున్ నటించిన రాపిడో ప్రకటపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్టీసీ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ర్యాపిడో ప్రకటన ఉందంటూ అల్లు అర్జున్‌తో పాటు ర్యాపిడో సంస్థకు కూడా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నోటీసులు పంపారు. అల్లు అర్జున్ నటించిన ర్యాపిడో ప్రకటనపై అభ్యంతరాలు వచ్చాయని సజ్జనార్ తెలిపారు.
సంస్థ ప్రతిష్టను దిగజార్చేలా వాణిజ్య ప్రకటనలు ఉన్నాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఫైర్ అయ్యారు. ఈ మేరకు సజ్జనార్ ప్రకటన విడుదల చేశారు. అందులో ..అల్లు అర్జున్ నటించిన రాపిడో ప్రకటనపై పలు అభ్యంతరాలు వస్తున్నాయి. యూట్యూబ్‌లో ప్రసారం అవుతున్న ఈ ప్రకటనలో ఆర్టీసీ బస్సులు సాధారణ దోసెల మాదిరిగానే ఎక్కువ సమయం తీసుకుంటాయని, ర్యాపిడో చాలా వేగంగా, సురక్షితంగా ఉంటుందని, అదే సమయంలో మసాలా దోసెను సిద్ధం చేస్తుందని నటుడు ప్రజలకు చెప్పడం కనిపిస్తుంది.
దీంతో ప్రయాణికులు, ఆర్టీసీ ఉద్యోగుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆర్టీసీ బస్సులను ప్రతికూలంగా చూపించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. ఆర్టీసీని కించపరిస్తే సంస్థ, ఉద్యోగులు, ప్రయాణికులు సహించరు అని సజ్జనార్ తేల్చిచెప్పారు. టీఎస్ ఆర్టీసీ సామాన్యుల సేవలో ఉంది. ప్రజా రవాణాను ప్రోత్సహించే ప్రకటనల్లో నటులు నటించాలని సజ్జనార్ సూచించారు.