కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ తుదిశ్వాస విడిచారు. ఈరోజు ఉదయం జిమ్ చేస్తుండగా గుండెపోటు రావటంతో ఆయన్ను బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆలస్యం కావటంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందని వైద్యులు వెల్లడించారు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం కేవలం శాండల్ వుడ్‌ను మాత్రమే కాకుండా భారతీయ సినిమా పరిశ్రమను సైతం తీవ్ర విషాదంలో నింపేసింది.
చిన్న వయస్సులోనే స్టార్ హీరోగా ఉన్న పునీత్ మృతి అందరికి షాక్ ఇచ్చింది. పునీత్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీతో ఎంతో సంబంధం ఉంది. ఇక్కడ స్టార్ హీరోలు అందరితోనూ ఆయనకు మంచి అనుబంధం ఉంది. నటుడిగా నేపథ్య గాయడకుడిగా, టెలివిజన్ వ్యాఖ్యతగా, ఆడియో కంపెనీ ఓనర్‌గా, నిర్మాతగా ఎన్నో రంగాల్లో కన్నడ ఇండస్ట్రీకి సేవలందించారు పునీత్ రాజ్‌కుమార్.
కన్నడ నాట అత్యథిక కలెక్షన్లు సాధించిన హీరోగా, అత్యథిక పారితోషికం అందుకున్న హీరోగానూ రికార్డ్ సృష్టించారు. దాదాపు 20 ఏళ్ల కెరీర్‌లో 29 సినిమాలు చేశారు పునీత్ రాజ్‌కుమార్. చివరగా యువరత్న సినిమాలో నటించారు. ఇక పునీత్ రాజ్‌కుమార్ మరణం పట్ల కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికార లాంఛనాలతో పునీత్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. కాగా, పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలను తన తండ్రి కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ సమాధి వద్దే నిర్వహించనున్నారు.