దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సినిమాలకు ఉండే క్రేజ్‌తో పాటు మార్కెట్ ఏ రేంజ్‌లో బిజినెస్ జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రమోషన్లు పెద్దగా చేయకపోయినా కూడా వందల కోట్లు ధారపోసి మరీ సినిమా ఏరియాల రైట్స్ కొంటారు. అయితే ఇప్పుడు ఆయన తెరకెక్కిస్తోన్న మోస్ట్ అవైటింగ్ మూవీ ఆర్ ఆర్ ఆర్ విషయంలో మాత్రం మార్కెట్ రేటు కంటే తక్కువ రేటు మాత్రమే డిస్ట్రిబ్యూటర్లు కోడ్ చేస్తున్నారట. ఇదే ఇప్పుడు బిజినెస్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇందుకు చాలా కారణాలే ఉన్నాయి. ఒకటి కరోనా దెబ్బ తర్వాత చాలా థియేటర్లు ఇంకా తిరిగి ఓపెన్ కాలేదు. ప్రేక్షకులు ఇంకా థియేటర్లకు ఫ్యామిలీలతో సహా వస్తారా ? అన్న సందేహాలు ఉన్నాయి. మిగిలిన సినిమాల లెక్కలు వేరు. మహా అయితే రు. 50 కోట్ల రేంజ్‌లోనే వాటి మార్కెట్ ఉంటుంది. ఆర్ ఆర్ ఆర్ అలా కాదు.. కనీసం రు. 500 కోట్ల పైనే మార్కెట్ ఉంటుంది. ఇక తెలంగాణలో ఎలా ఉన్నా ఆంధ్రాలో టిక్కెట్ రేట్లు తగ్గించేశారు.
ఇప్పుడు అక్కడ సినిమా థియేటర్ల విషయంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ముందుగా అనుకున్న రేట్ల కంటే 30 % తగ్గించి మరీ ఏరియాల వారీ రైట్స్ అమ్ముతున్నారట. హెచ్చు తగ్గులు ఉంటే రిలీజ్ అయ్యి వసూళ్లు వచ్చాక చూసుకుందాంలే అన్న ఒప్పందాల మీద ఈ బిజినెస్ నడుస్తోందని తెలుస్తోంది. ఉదాహరణకు ఏపీలో ఓ జిల్లాలో ముందుగా ఆర్ ఆర్ ఆర్ రైట్స్ రు. 18 కోట్లకు అమ్మాలనుకున్నారు.
అయితే ఇప్పుడు రు. 5 కోట్లు తగ్గించి రు. 13 కోట్లకే అమ్మారట. వైజాగ్ రైట్స్ ముందు రు. 26 కోట్లకు అమ్మితే.. ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి దానిని రు. 19 కోట్లకే కుదించారట. ఏపీలో అన్ని ఏరియాల్లోనూ ఇదే పరిస్థితి ఉందట. ఇక్కడే భారీ నష్టం జరుగుతుందని అంటున్నారు. అయితే నైజాంతో పాటు ఓవర్సీస్ డీల్స్ విషయంలో మాత్రం తగ్గడం లేదట. అయితే ఏపీలో రేట్ల తగ్గింపు సాకుగా చూపి వాళ్లు కూడా తగ్గించమని అడిగితే ఆర్ ఆర్ ఆర్ బిజినెస్‌కు పెద్ద దెబ్బ పడిపోతుంది.