సిటీమార్ సినిమా చూసిన వాళ్లే చాలా మంది గోపీచంద్ పని ఇక హీరోగా అయిపోయిందని అనుకున్నారు. ఇక ఇప్పుడు వచ్చిన ఆరడుగుల బుల్లెట్ గురించి కనీసం పట్టించుకున్న వాడు కూడా లేడు. ఎప్పుడో నాలుగైదేళ్ల క్రితం రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను ఎన్నో సార్లు రిలీజ్‌డేట్లు ఎనౌన్స్ చేసి.. పోస్టర్లు కూడా వేశారు. ఇలా ఎన్నోసార్లు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. పైగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు నిర్మాతలు పడిన కష్టాలు చూస్తే జాలేస్తోంది.
ఈ సినిమాను కొనేందుకు కూడా ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో చివరకు మనీ రిటర్న్ గ్యారెంటీ పద్ధతిపై కేవలం రు. 3 కోట్లకు అమ్మారట. అది కూడా డబ్బులు రాకపోతే తిరిగి కట్టాలట. ఇంత తక్కువ రేటుకు సినిమా అమ్మినా కూడా చాలా ఏరియాల్లో రిలీజ్ చేయలేదు. ఇంకా చెప్పాలంటే బీ, సీ సెంటర్లలో ఈ సినిమా కంటే అదే రోజు రిలీజ్ అయిన కేవలం రెండు సినిమాల అనుభవం మాత్రమే ఉన్న మెగా హీరో వైష్ణవ్ కొండపొలం సినిమాను రిలీజ్ చేశారు.
ఇక రివ్యూవర్లు కొండపొలం సినిమా చూసి రివ్యూలు రాశారే తప్పా ఈ సినిమాను చూసేందుకు కూడా ఇష్టపడలేదు. ఎంత చెత్త సినిమా అయినా రివ్యూ కోసం అయినా చూసే రివ్యూవర్లే ఈ సినిమాను వదిలేశారంటే ఆరడుగుల బుల్లెట్ ఎంత తుప్పు పట్టిపోయిందో తెలుస్తోంది. థియేటర్‌కే కాదు.. ఓటీటీకి చివరకు టీవీలో చూసేందుకు కూడా పనికిరాని సినిమా ఇది అన్న కామెంట్లు పడుతున్నాయి. ఇక ఈ సినిమాకు తొలి రోజు కేవలం ఏపీ, తెలంగాణలో రు. 52 లక్షలు వరల్డ్ వైడ్‌గా రు. 57 లక్షల వసూళ్లు మాత్రమే వచ్చాయి.
ఇక ఈ సినిమాకు ముందు అనుకున్న టైటిల్ ఇది కాదు జగన్మోహన్ ఐపీఎస్. తమిళ దర్శకుడు భూపతి పాండ్యన్ సగానికి పైగా షూటింగ్ చేసి వదిలేస్తే.. మిగిలిన దానిని బి.గోపాల్ కంప్లీట్ చేశాడు. గోపీచంద్ ఇప్పటకి అయినా మారి ఫైట్లు, పాటలు వదిలేసి మంచి సబ్జెక్ట్ ఉన్న కథలను ఎంచుకుంటే కొద్ది రోజులు అయినా అతడి పేరు గుర్తుండే ఛాన్స్ ఉంది.